ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేసింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత షెడ్యూల్ 9,10 కింద తెలంగాణలో ఉండిపోయిన ఆస్తులను పంచుకోవలసి ఉంది. వాటి విలువ సుమారు రూ.1,42, 601 కోట్లు ఉంటుందని కానీ తెలంగాణ ప్రభుత్వం వాటి పంపకాలకి సహకరించడం లేదని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం మొండి వైఖరి వలన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,21 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులకి భంగం కలుగుతోందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్ధికంగా తీవ్రంగా నష్టం జరుగుతోందని, కనుక తక్షణమే ఆ ప్రక్రియ మొదలుపెట్టి పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్‌లో కోరింది.
తెలంగాణ సిఎం కేసీఆర్ అధ్యక్షతన ఏర్పడిన బిఆర్ఎస్ పార్టీ త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోతన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించబోతోందని వార్తలు వస్తున్న ఈ సమయంలో వైసీపీ ప్రభుత్వం హడావుడిగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం అనుమానాస్పదంగానే ఉంది. ఆ ఆస్తుల పంపకాలు చేయకపోవడం వలన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి నష్టం జరుగుతోందని భావిస్తున్నట్లయితే, వైసీపీ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన వెంటనే ఈ పిటిషన్ వేసి ఉండేది. కానీ ఇంతకాల కాలక్షేపం చేసి ఇప్పుడు బిఆర్ఎస్ ఏపీలో ప్రవేశించేందుకు సిద్దమవుతుంటే వేసింది?
తద్వారా ఏపీలో బిఆర్ఎస్ వలన వైసీపీకి నష్టం జరుగుతుందనుకొంటే అప్పుడు దీంతో సహా ఇటువంటి సమస్యలన్నీ అటక మీద నుంచి దించి నిలదీయవచ్చు. లేదా ఇటువంటి అంశాలతో ఏపీ ప్రజలలో సెంటిమెంట్ రగిలించి లబ్ది పొందవచ్చు.
ఏపీలో బిఆర్ఎస్ అడుగుపెట్టలంటే ఎటువంటి సవాళ్ళు ఎదుర్కోవాలో కేసీఆర్‌కి తెలియదనుకోలేము. కనుక 2-3 లోక్‌సభ సీట్లకి వైసీపీతో లోపాయికారీగా ఒప్పందం చేసుకోవచ్చు. కేసీఆర్, జగన్ ఇద్దరికీ చంద్రబాబు నాయుడు శత్రువే. కనుక వచ్చే ఎన్నికలలో టిడిపిని అడ్డుకొనేందుకు వైసీపీ, బిఆర్ఎస్ రెండూ కత్తులు దూసుకొంటున్నట్లు నటిస్తూ ఈ సెంటిమెంట్ గేమ్ ఆడే అవకాశం ఉంది. బహుశః అందుకే వైసీపీ ఇప్పటి నుంచే ఇటువంటి అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకొంటున్నట్లుంది.



