టిడిపికి మల్లారెడ్డి అవసరమా?

CH Malla Reddy Meets Chandrababu Naidu

తెలంగాణలో టిడిపిని మళ్ళీ బలోపేతం చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి బహుశః దానిని ఓ అవకాశంగా భావించారో ఏమో… చంద్రబాబు నాయుడుని కలిశారు.

బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుని కలిశారు. వారిలో తీగల కృష్ణారెడ్డి తాను టిడిపిలో చేరబోతున్నట్లు స్పష్టంగా చెప్పేశారు.

ADVERTISEMENT

కానీ మల్లారెడ్డి మాత్రం తమ ఇంట్లో జరుగబోయే శుభకార్యక్రమానికి ఆహ్వానించేందుకే చంద్రబాబు నాయుడుని కలిశామని మీడియా, జనాల చెవిలో కాలీఫ్లవర్ పూలు పెట్టేందుకు ప్రయత్నించారు.

తీగల కృష్ణారెడ్డి టిడిపితోనే రాజకీయ ప్రవేశం చేసి చాలా కాలం ఆ పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత గత్యంతరం లేని పరిస్థితులలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. కానీ కేసీఆర్‌ ఏనాడూ ఆయనని పట్టించుకోలేదు. కనుక బిఆర్ఎస్ పార్టీలో ఇమడలేక దూరంగా ఉంటున్నారు.

ఆయనని కాంగ్రెస్ పార్టీలో చేరాలని రేవంత్‌ రెడ్డి ఆహ్వానించినప్పటికీ చేరలేదు. ఇప్పుడు చేరినా ప్రయోజనం ఉండదు. కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకొని మళ్ళీ టిడిపి గూటికి చేరుకోవాలనుకోవడం సహజమే.

కానీ మాజీ మంత్రి మల్లారెడ్డి భూకబ్జాల ఘన చరిత్ర ఉంది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెరువు కబ్జా చేసి నిర్మించిన వారి కాలేజీ భవనాలను కూల్పించేందుకు ప్రయత్నించి, రాజకీయ కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడు హైడ్రా జాబితాలో వారి కాలేజీలు ఉన్నాయి! కాలేజీలలో వార్షిక పరీక్షలు ముగిసి వేసవి సెలవులు ఇవ్వగానే వాటిని కూల్చివేసేందుకు హైడ్రా కాసుకుకూర్చోంది. ఇక మల్లారెడ్డి కుటుంబంపై ఈడీ, ఆదాయపన్నుల కేసులు కూడా ఉన్నాయి.

చంద్రబాబు నాయుడుకి ఇటు తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డితో అటు కేంద్రంలో మోడీతో సత్సంబంధాలు, పలుకుబడి ఉంది కనుక టిడిపిలో చేరిపోతే ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడవచ్చని మల్లారెడ్డి భావిస్తున్నారేమో?

కనుక మల్లారెడ్డిని టిడిపిలో చేర్చుకోవడం అంటే అవినీతి, అక్రమాలు, భూకబ్జాలకు రక్షణ కల్పించిన్నట్లే అవుతుంది. పైగా మల్లారెడ్డి వంటివారిని చేర్చుకుంటే రాజకీయంగా కూడా కొత్త సమస్యలు పుట్టుకువచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక సిఎం చంద్రబాబు నాయుడు తొందరపాటు నిర్ణయం తీసుకోరనే భావించవచ్చు.

అసలు ఒక్కో రాష్ట్రం ఒక్కోరి సొంత సామ్రాజ్యాలుగా మారిపోయినందున, తెలంగాణలో టిడిపిని బలోపేతం చేయడం అంటే వారి బంగారు పుట్టలో వేలు పెట్టిన్నట్లే.

పవన్‌ కళ్యాణ్‌ తమిళనాడువైపు చూస్తేనే అటునుంచి ట్విట్టర్‌లో బాంబులు కురుస్తున్నాయి. కేసీఆర్‌ ఆంధ్రా, మహారాష్ట్ర రాజకీయాలలో వేలు పెట్టి చెయ్యి కాల్చుకున్నారు. కనుక చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్‌, బిఆర్ఎస్, బీజేపీలతో లెక్కలన్నీ సరిచూసుకున్న తర్వాతే ముందుకు సాగుతారని ఆశిద్దాం. టిడిపిలో చంద్రబాబు నాయుడుతో సహా హేమాహేమీలైన రాజకీయవేత్తలు చాలామందే ఉన్నారు. కనుక సరైన నిర్ణయమే తీసుకుంటారని ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories