చంద్రబాబు తెచ్చిన ప్రాజెక్టునే దావోస్ వెళ్ళి తెచ్చుకొన్న జగన్?

Chandrababu_Naidu-Adani_Groupఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటనలో రాష్ట్రానికి 1.25 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించారని సాక్షి, వైసీపీ గొప్పగా చెప్పుకొంటున్నాయి. కానీ వాస్తవం ఏమిటంటే ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆదానీ గ్రూప్ విశాఖలో రాబోయే 20 ఏళ్లలో రూ.70,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకొంది.

ఆదానీ గ్రూప్ విశాఖ కేంద్రంగా ఒక గిగావాట్ సామర్ధ్యం కలిగిన మూడు డాటా సెంటర్లు ఏర్పాటు చేయాలనుకొంది. ఆ ప్రాజెక్టుకి 2019, ఫిబ్రవరి 14న విశాఖలో శంకుస్థాపన కూడా చేశారు. ఆ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, ఆదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ ఆదానీతో సహా ఆ సంస్థకు చెందిన పలువురు డైరెక్టర్లు కూడా హాజరయ్యారు. ఇదిగో ఆనాటి ఫోటో…

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడు ఏమి చేస్తే వాటిని గుడ్డిగా వ్యతిరేకించడం, వాటిలో అవినీతి, అక్రమాలు జరిగిపోయాయంటూ వాటిని నిలిపివేయడం లేదా పూర్తిగా వాటిని రద్దు చేయడం, పునః పరిశీలన, రివర్స్ టెండరింగ్ పేరుతో అన్నీ తిరగదోడుతూ పనులు ముందుకు సాగకుండా నిలిపివేయడం అందరికీ తెలుసు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులే ఇందుకు అతిపెద్ద నిదర్శనాలుగా కనిపిస్తున్నాయి. కానీ అవి కాక ఇంకా చాలానే ఉన్నాయి.

ఆనాడు చంద్రబాబు నాయుడు ఆదానీ ప్రాజెక్టుతో పాటు పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పలు సోలార్, విండ్ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలను కూడా తీసుకువచ్చారు. 5.2 గిగావాట్స్ విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యంతో వాటిని నెలకొల్పారు. కొన్ని సమైక్య రాష్ట్రంలో చేసుకొన్న అగ్రిమెంట్స్ కాగా మరికొన్ని చంద్రబాబు నాయుడు హయంలో చేసుకొన్నవి.

జగన్ ప్రభుత్వం వాటి పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ (విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు)పునః సమీక్ష పేరుతో కొర్రీలు వేసింది. దీంతో సోలార్ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలపై సుమారు రూ.21,000 కోట్ల అదనపు ఆర్ధిక భారం పడటంతో అవన్నీ హైకోర్టును కూడా ఆశ్రయించాయి.

అప్పుడు హైకోర్టు జగన్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసి పాత అగ్రిమెంట్ ప్రకారం వాటికి ఛార్జీలు చెల్లించాలని 2019, సెప్టెంబర్ 24వ తేదీన తీర్పు చెప్పింది. జూన్‌ 2021వరకు వాటికి చెల్లించాల్సిన బకాయిలను 2019 డిసెంబర్‌లోగా పూర్తిగా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడా మొట్టికాయలు పడ్డాయి.

అప్పుడు రాష్ట్రానికి వచ్చిన ఆదానీ గ్రూప్‌ని ముందుకు సాగనీయకుండా అడ్డుకొని, రాష్ట్రంలో సోలార్, విండ్ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న సంస్థలను ముప్పతిప్పలు పెట్టిన సిఎం జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు దావోస్ వెళ్ళి అదే ఆదానీ గ్రూప్ అధినేతను బ్రతిమాలుకొని పెట్టుబడులను పునరుద్దరింపజేసుకొన్నారని అర్దమవుతూనే ఉంది. కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి దావోస్‌ పర్యటనకు వెళ్ళి తొలి ప్రయత్నంలోనే రాష్ట్రానికి రూ.1.25 కోట్ల పెట్టుబడులు సాధించారని చెప్పుకోవడం విడ్డూరమే కదా?కనుక ఆనాడు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుకే సిఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు మరోసారి శంకుస్థాపన చేస్తారేమో?

Solar_wind_power_dispute

High Court order

ADVERTISEMENT
Latest Stories