ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటిలాగే అలవాటు ప్రకారం తన కంటే వయసులో, అనుభవంలో చాలా చిన్నవాడైన తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్‌కు స్నేహహస్తం అందించారు.
చెన్నైలో జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా పాల్గొన్నారు. అయన సమక్షంలోనే ఏపీ, తమిళనాడు అభివృద్ధి కోసం ఇద్దరం కలిసి పనిచేద్దామని చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానాన్ని కూడా ఆయన ప్రతిపాదించారు.
అయితే మొదటి నుంచీ బీజేపీ, దాని మిత్రపక్షాలకు దూరంగా ఉంటున్న విజయ్.. దాదాపు మాజీ సీఎం జగన్ శైలినే అనుసరిస్తున్న నేపథ్యంలో చంద్రబాబుతో కలిసి పనిచేయడానికి, ఆయన ప్రతిపాదనలను అమలు చేయడానికి అంతగా ఆసక్తి చూపుతారా? డౌటే!
సిఎం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నారు. బిజేపితో కలిసి పని చేస్తున్నారు. పైగా ప్రధాని మోదీకి సన్నిహితంగా ఉంటారు.
బహుశః అందువల్లేనేమో అమిత్ షా, చంద్రబాబు నాయుడులతో విజయ్ ముభావంగా వ్యవహరించినట్లున్నారు. ఈ సమావేశంలో సిఎం విజయ్ ఫోటోలు చూస్తే అదే అనిపిస్తుంది. కానీ ఫోటోలను చూసి అయనకు అటువంటి అభిప్రాయం ఉందని అనుకోవడం కూడా సరికాదు.
అయితే భారత రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరైన, నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు స్వయంగా ముందుకు వచ్చి స్నేహ హస్తాన్ని అందిస్తున్నప్పుడు, సిఎం విజయ్ భేషజాలకు పోకుండా ఇది రాజకీయంగా తనకు, తన పార్టీకి, తన ప్రభుత్వానికి, తన రాష్ట్రానికి లభించిన అవకాశంగా గుర్తిస్తే లాభాపడవచ్చు.
ఉదాహరణకు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి సిఎం చంద్రబాబు నాయుడు స్నేహాన్ని సద్వినియోగం చేసుకున్నారు కనుకనే, టీడీపికి చెందిన పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వరంగల్ విమానాశ్రయం ఏర్పాటుకి అన్ని విధాల సహకరిస్తున్నారు.
చంద్రబాబు నాయుడుకున్న రాజకీయ, పరిపాలనానుభవం, కేంద్రంలో పలుకుబడి వంటివి ఎవరికీ అప్పనంగా లభించవు. లభిస్తున్నప్పుడు కాదనుకోకుండా సవినయంగా స్వీకరించి బాగుపడటం తెలివైనవారు చేసే పని. మరి సిఎం విజయ్ ఏం చేస్తారో?





