టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుంచి 50 రోజులపాటు ఏకధాటిగా సాగే ‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ 50 రోజులలో 8,000 మందితో కూడిన టిడిపి బృందాలు రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలను కలిసి వైసీపీ పాలనలో జరుగుతున్న అనార్ధాలను, అవినీతి, అక్రమాలను వివరించి ప్రజలెదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకొని ప్రభుత్వంతో పోరాడుతారు.
చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలో దెందులూరులో లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది.
నేటి నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు నాయుడు ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్నారు. పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో బహిరంగసభలో పాల్గొన్న తర్వాత వలసపల్లి క్రాస్ రోడ్ ధర్మాజీగూడెం, మఠంగూడెం, లింగంపాలెం మీదుగా చింతలపూడి పట్టణం వరకు రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సిఎం జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు.
“తన తండ్రి వివేకానందా రెడ్డి హత్య కేసుపై రాష్ట్రంలో దర్యాప్తు సరిగ్గా జరగడంలేదని ఆయన కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసును తెలంగాణకి బదిలీ చేయించుకోవడం అంటే జగన్‌కు చెప్పుతో కొట్టినట్లే! అసలు వివేకని ఎవరు చంపారు? ఎందుకు చంపారు?అనే విషయంపై సిఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు విప్పడం లేదు?సొంత బాబాయ్ హత్యకు గురైతే నిమ్మకి నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్న జగన్‌కు ముఖ్యమంత్రిగా ఉండే హక్కే లేదు. ”
“నేను ఆనాడే చెప్పాను. జగన్ ముఖ్యమంత్రి అయితే అమరావతి, పోలవరం పనులు నిలిచిపోతాయని. అదే కదా జరిగింది?పాదయాత్రలో ముద్దులు పెడుతున్నాడని మురిసిపోవద్దు… ఆ తర్వాత పిడిగుద్దులు గుద్దుతాడని ఆనాడే నేను చెప్పాను. ఇప్పుడే అదే కదా చేస్తున్నాడు?జగన్ గురించి నాకు బాగా తెలుసు. అందుకే నా రాజకీయ అనుభవంతో ఈవిదంగా జరుగబోతోందని ఆనాడు చెప్పాను. అదే జరుగుతోంది. మళ్ళీ మీరు జగన్‌కి మరో ఛాన్స్ ఇస్తే ఈ రాష్ట్రం ఏమవుతుందో కూడా ఎవరూ ఊహించలేరు. కనుక ఇప్పటికైనా మీరు నా మాట వింటారా లేదా?” అని చంద్రబాబు నాయుడు ప్రజలను ప్రశ్నించారు.
“టిడిపి అధికారంలోకి వస్తే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పధకాలన్నీ నిలిపివేస్తుందని, ఇళ్ళు ఇవ్వకుండా నిలిపివేస్తుందని వైసీపీ నేతలు వాలంటీర్ల ద్వారా దుష్ప్రచారం చేయిస్తూ మిమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. కానీ వారి మాటలు నమ్మకండి. టిడిపి అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ఆ సొమ్మునంతా పేద ప్రజలకే పంచిపెడతాను. మరిన్ని మంచి సంక్షేమ పధకాలు ప్రవేశపెడతాను. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదనేదే టిడిపి సిద్దాంతం. కనుక దానికి మేము ఎప్పుడూ కట్టుబడే ఉంటాము,” అని స్పష్టత ఇచ్చారు.
ఉభయగోదావరి జిల్లాలలో టిడిపి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారానికి సమాధానమన్నట్లు వేలాదిగా ప్రజలు తరలి వచ్చి చంద్రబాబు నాయుడుకి అడుగడుగునా నీరాజనాలు పట్టారు. ఎంతో ఉత్సాహంగా ఆయన రోడ్ షోలలో పాల్గొనారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ఆ జనాలను చూస్తే వారిలో వైసీపీ పాలన పట్ల ఎంత అసహనం, అసంతృప్తి గూడుకట్టుకొని ఉందో అర్దం అవుతోంది.



