ఏపీ కంటే దాదాపు రెండేళ్ళ ముందుగానే తెలంగాణలో మహాలక్ష్మి పధకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మొదలైంది. దాని వలన ఆదాయం కోల్పోయే ఆటో డ్రైవర్లకు ఎంతో కొంత ఇస్తామని సిఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఏమంటే ఆదాయం అంతా గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీలకే సరిపోతోంది. ప్రభుత్వం వద్ద డబ్బులేదని సర్ది చెపుతున్నారు.
తెలంగాణతో పోలిస్తే ఏపీ ఆర్ధిక పరిస్థితి అంత గొప్పగా లేదు. రాష్ట్ర విభజన వలన ఒకసారి, వైసీపీ పాలనతో మరోసారి రెండు అతిపెద్ద ఎదురు దెబ్బలు తింది.
కనుక సూపర్ సిక్స్ కాదు కదా… పించన్లు కూడా ఇవ్వగలదో లేదో అని అందరూ భయపడ్డారు. కానీ మూడు నెలల బాకాయిలతో సహా నెలకు రూ.4,000 పెంచిన పించన్లు అందించారు!
ఆ తర్వాత సిఎం చంద్రబాబు నాయుడు తన వైఖరికి పూర్తి భిన్నంగా వరుసపెట్టి సంక్షేమ పధకాలు అమలుచేస్తూనే ఉన్నారు. స్త్రీశక్తితో ముడిపడిన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పధకాన్ని కూడా నేడు ప్రారంభించారు.
సిఎం చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలందరూ ఆటో డ్రైవర్లలా కాకీ చొక్కాలు ధరించి వారితో కలిసి సభా వేదికల వద్దకు ఆటోలలోనే ప్రయాణించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఓ పండగలా నిర్వహించారు.
ఓ పక్క సిఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లను ఉద్దేశ్యించి ప్రసంగిస్తున్నప్పుడే ఆటో డ్రైవర్ల ఫోన్లకు “రూ. 15,000 మీ బ్యాంక్ ఖాతాలో జమా అయ్యింది” అంటూ బ్యాంకుల నుంచి మెసేజ్‌లు వస్తుండటంతో వారి సంతోషానికి అవధులే లేవు. కనుక అందరూ మనస్పూర్తిగా ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈవిదంగా చేసి ఉండొచ్చు. కానీ ఆర్ధిక సమస్యలు పేరుతో ఆటో డ్రైవర్లని విస్మరించారు. కనుకనే బీఆర్ఎస్ పార్టీ ఆటో డ్రైవర్లను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పగలుగుతోంది.
కానీ సిఎం చంద్రబాబు నాయుడు మాత్రం ‘స్త్రీశక్తి’ ఆర్ధిక భారం మోసేందుకు సిద్దపడినప్పుడు, ‘ఆటో డ్రైవర్ల సేవలో’ అనే పధకాన్ని వదులుకోవడం దేనికని దీనినీ అమలుచేశారు.
ఆటో డ్రైవర్ల ఖాతాలలో డబ్బులు జమా చేసి ఊరుకోవచ్చు. కానీ ఈ కార్యక్రమాన్ని కూడా ఓ పండగలా నిర్వహించి రాష్ట్రంలో లక్షలాది ఆటో డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులు, ప్రజల మన్ననలు సొంతం చేసుకుంటున్నారు.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఇలాంటి ఓ గొప్ప అవకాశాన్ని వదులుకుంటే, సిఎం చంద్రబాబు నాయుడు దీనిలో నుంచి కూడా ఓ అవకాశాన్ని సృష్టించుకుని తెలివిగా వాడేసుకుంటున్నారు. వైసీపీ నేతలు ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టేందుకు అవకాశం కూడా లేకుండా చేశారు.




