ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజక వర్గం అయిన కడప వేదికగా గత మూడేళ్ళుగా జరుగుతున్న అభివృద్ధిపై పనులపై ప్రశ్నలు వేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. తాజాగా కడప జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టగా, గత రెండేళ్ల క్రితం చేపట్టిన డెవలప్మెంట్ అప్ డేట్స్ ను అడుగుతూ ఆట పట్టిస్తున్నారు.
2019 డిసెంబర్ లో సొంత జిల్లాకు వెళ్లిన జగన్ కడప స్టీల్ కు శంకుస్థాపన చేసి భారీ స్థాయిలో ఉక్కు విప్లవం అంటూ పెద్ద పెద్ద పదజాలాన్నే ఉపయోగించారు. అలాగే 2020 డిసెంబర్ లో వెళ్లి ఇంటిలిజెంట్ సెజ్ విప్లవం భారీ ఉద్యోగాలు వచ్చేస్తాయంటూ పలికారు. తాజాగా కొప్పర్తి పారిశ్రామికవాడలో 75 వేల మందికి ఉపాధి అంటూ మరో విప్లవం పేరును స్పృశించారు.
ఇలా ప్రతి డిసెంబర్ లో ఏదొక విప్లవ పేర్లనయితే ప్రకటిస్తున్నారు గానీ, మూడేళ్లల్లో జరిగింది శూన్యం అంటూ తెలుగు తమ్ముళ్లు సాక్షి పేపర్ కటింగ్స్ తో సహా పోస్ట్ చేస్తూ జగన్ సర్కార్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా క్రిస్మస్ వేడుకలకు ముందే జగన్ నుండి ఈ ‘విప్లవ’ ప్రకటనలు వస్తుండడం విశేషం.
మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన 2019 నాటి మాటలకు, నేటి చేష్టలకు ఎక్కడా పొంతన లేకపోవడాన్ని ఈ సందర్భంగా హైలైట్ అవుతోంది. ప్రతి ఏడాది ప్రకటనలకైతే ఏ మాత్రం కొదవ లేకుండా పోతోంది గానీ, ఎక్కడ వేసిన శిలాఫలకం అక్కడే ఉండి, పనులు మాత్రం అడుగు కూడా ముందుకు కదలడం లేదంటూ విస్మయాన్ని ప్రకటిస్తున్నారు.
అయితే తెలుగుదేశం కార్యకర్తలకు గానీ, సోషల్ మీడియా వింగ్ కు గానీ ముఖ్యమంత్రి పోసిషన్ అంటే ఏంటో అర్ధం కావడం లేదనుకుంటా! గత ఇరవై రోజులుగా అను నిత్యం సినీ ఇండస్ట్రీతో పోరాటం చేస్తూ, ప్రజలకు వినోదాన్ని అత్యంత చేరువ చేయాలన్న వైసీపీ సర్కార్ తాపత్రయం తెలుగు తమ్ముళ్లకు ఏ మాత్రం పట్టనట్లుగా కనపడుతోంది.
ఏ శాఖ మంత్రి అన్న సంబంధం లేకుండా అన్ని శాఖల మంత్రులు ఒక్క తాటిపైకి వచ్చి ప్రజలకు సినీ వినోదమే అత్యంత ప్రధానమైన అంశమని, తక్కువ ధరలో సినిమాలను వీక్షిస్తే ఎంతటి కష్టాన్ని అయినా మరిచిపోతారు కాబట్టి, దాని కోసం పేర్ని నానితో పాటు, బొత్స, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని… ఇంకా రాబోయే రోజుల్లో మిగిలిన మంత్రులు కూడా ఈ అంశంపై సినీ సెలబ్రిటీలతో పోరాటం చేస్తారేమో చూడాలి.
ఇలా సినీ వినోదంతో పాటు, ఆర్ధికంగా వెనుకబడిపోయిన రాష్ట్రానికి ఆదాయ వనరులు ఎలా సమకూర్చాలో అన్న ఆలోచనలతో జగన్ సర్కార్ తలమునకలై ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఆదాయం పెంచేందుకు ప్రతి రోజు ఏదొక కొత్త పధకంతో రాష్ట్ర ఖజానాను నింపడానికి పడుతున్న కష్టం కూడా ఈ టిడిపి వర్గాలకు కనిపిస్తున్నట్లుగా లేదు.
ఓటీఎస్ ద్వారా కాస్త పెద్ద మొత్తంలో ఆదాయం సమకూర్చే విధంగా ఇప్పటికే ప్రణాళికలు అమలు కాగా, తాజాగా కరెంట్ చార్జీలను పెంచడం ద్వారా పేద, మధ్య, ఉన్నత వర్గం అన్న తేడా లేకుండా అన్ని వర్గాల నుండి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ఆలోచనలు చేసి అమలు పరిచే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే ఇప్పటికే ఆస్తి పన్నులను పెంచడం, చెత్త పన్నులు వేయడం తదితర అంశాలు అమలుకు నోచుకున్నాయి.
ఇలా రాష్ట్రాన్ని ఆర్ధికంగా పురోగాభివృద్ధి దిశగా తీసుకువెళ్ళడానికి వైసీపీ సర్కార్ పడుతోన్న శ్రమను ఏ మాత్రం అవగతం చేసుకోకుండా, మూడేళ్ళ క్రితం కడప ఉక్కుకు రాయి పడింది, ఇప్పటివరకు మరో ఇటుక రాయి కూడా పడలేదు అంటూ ట్రోల్ చేయడం ఏమైనా సమంజసంగా ఉందా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పరిపాలన ఈ స్థాయిలో జరగలేదు గనుక, ఇవన్నీ తెలుగు తమ్ముళ్లకు అర్ధం కావడం లేదేమో!?



