హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సామాన్య ప్రజల ఆగ్రహానికి గురవుతోంది. అయినప్పటికీ ‘తగ్గేదేలే’ అంటూ హైడ్రాకి చట్టబద్దత, మరిన్ని అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. దనైకి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు ఆమోదముద్ర కూడా వేశారు.
కనుక హైడ్రా దూకుడు మరింత పెరుగబోతోందని భావించవచ్చు. అయితే ఈసారి సామాన్యుల ఇళ్ళపైకి కాక కేటీఆర్, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి బిఆర్ఎస్ బడాబాబుల ఇళ్ళపైకి జేసీబీలు దూసుకువెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి.
శుక్రవారం సిఎం రేవంత్ రెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, మూసి బాధితులను అడ్డం పెట్టుకొని ఏ బడాబాబులు తమ ఫామ్‌హౌస్‌లు కాపాడుకోవాలనుకొంటున్నారు? అని సూటిగా ప్రశ్నించారు. అంటే ఎవరినీ విడిచిపెట్టేది లేదని హెచ్చరించిన్నట్లే భావించవచ్చు.
ఓసారి 11 ఏళ్ళు వెనక్కి వెళితే, తెలంగాణ సాధన కోసం అన్ని పార్టీలు, ప్రజలు, ఉద్యోగులు, విద్యార్ధులు, మహిళలు, సింగరేణి, ఆర్టీసీ, పారిశుధ్య కార్మికులు అందరూ కలిసికట్టుగా పోరాడారు. వారి ఐకమత్యం, పోరాట స్పూర్తి వలననే తెలంగాణ ఏర్పడిందని చెప్పవచ్చు.
తెలంగాణ ఏర్పడిన వెంటనే ప్రజలు రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెట్టారు. కానీ కేవలం ఏడాదిలోగానే కేసీఆర్ తన విశ్వరూపం చూపడం మొదలుపెట్టారు. ఓ ఉద్యమకారుడు, ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ నిరంకుశవాదిగా పరివర్తన చెందడం చూసి సామాన్య ప్రజలు కూడా దిగ్బ్రాంతి చెందారు. అయినప్పటికీ బంగారి తెలంగాణ కోసం ఆ మార్పు తప్పదని సరిపెట్టుకున్నారు.
ప్రజల మౌనాన్ని కేసీఆర్ చాతగానితనంగా భావించడంతో అహంకారం పెరిగిపోయింది. అప్పటి నుంచే తెలంగాణలో ప్రతిపక్షాలు బలపడటం మొదలైంది. కేసీఆర్ మొదటిసారి పదవీకాలం ముగించుకునే సరికే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు బలపడి వాటి గొంతు వినిపించడం మొదలైంది. ఎందువల్ల?
తెలంగాణ ఏర్పడేవరకు కూడా ఎంతో ఐకమత్యం ఉన్న రాష్ట్రంలో కేవలం 5 ఏళ్ళలోనే వ్యతిరేకత ఎందుకు మొదలైంది? అన్ని పార్టీలు ఎందుకు పుట్టుకువచ్చాయి?అంటే కేసీఆర్ ధోరణి వల్లనే అని అర్దమవుతూనే ఉంది.
ఈ నేపధ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి తీరుని గమనిస్తే, ఆయన కూడా అతితక్కువ సమయంలోనే ప్రజావ్యతిరేకత మూటగట్టుకొంటూ, హైడ్రాతో తన రాజకీయ శత్రువులు బలపడేందుకు దోహదపడుతున్నారని చెప్పక తప్పదు.
ఒక్క హైడ్రా మాత్రమే కాదు… ఆయన పాలనలో ఏదో గొప్ప మార్పు చూపుతారని ప్రజలు ఎదురుచూస్తుంటే, కేసీఆర్ హయాంలో జరిగిన కుంభకోణాలు తవ్వి తీసేందుకు ఎక్కువ శ్రద్ద చూపుతున్నారు. ముఖ్యంగా రైతాంగానికి అవసరమైన నీళ్ళు, విద్యుత్ అందించడం, సామాన్య ప్రజల సమస్యలు, అవసరాలు తీర్చడం కంటే ఢిల్లీ పర్యటనలతో 10 నెలలు అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకున్నట్లు కనిపిస్తుంది.
రేవంత్ రెడ్డికి బయటకు చెప్పుకోలేని అనేక పరిమితులు, సమస్యలు, ఒత్తిళ్ళు ఉండి ఉండవచ్చు గాక. కానీ వాటన్నిటినీ తట్టుకొని నిలబడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని, ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని ఆశించడం అత్యాశ కాబోదు కదా?అందుకే ప్రజలు కేసీఆర్‌ని కాదని రేవంత్ రెడ్డిని గెలిపించారు కదా?
కనుక రేవంత్ రెడ్డి ఓసారి ఆత్మావలోకనం చేసుకొని లోపాలు సరిదిద్దుకొని ముందుకు సాగితే ఆయనకు తిరుగు ఉండదు. కాదని కేసీఆర్, జగన్‌లాగ మొండిగా ముందుకు సాగితే చివరికి ఆయన, ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.




