వైసీపీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం!

Dead Body In YSR Congress MLC's Carకాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ కారు డ్రైవరుగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. గురువారం రాత్రి 10.30 గంటలకు ఉదయ్ భాస్కర్ స్వయంగా వచ్చి సుబ్రహ్మణ్యాన్ని తనతో తీసుకువెళ్లారని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. రాత్రి ఒంటి గంటకు ఉదయ్ భాస్కర్ సుబ్రహ్మణ్యం తమ్ముడికి ఫోన్‌ చేసి మీ అన్న రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెప్పారు.

మరో గంట తరువాత అంటే ఈరోజు తెల్లవారుజామున రెండు గంటలకు ఉదయ్ భాస్కర్ అతని మృతదేహాన్ని కారులో తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రయత్నించారు. కానీ వారు సుబ్రహ్మణ్యం మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో ఆయన ఆ కారును, కారులో మృతదేహాన్ని అక్కడే వదిలి పారిపోయారని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు చెప్పారు.

ADVERTISEMENT

ఉదయ్ భాస్కర్ వద్ద సుబ్రహ్మణ్యం గత 5 ఏళ్లుగా కారు డ్రైవరుగా పనిచేస్తున్నాడని తెలిపారు. సుబ్రహ్మమణ్యాన్ని ఎమ్మెల్సీ, ఆయన అనుచరులే బందించి కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేసే వరకు అంత్యక్రియలు జరుపబోమని చెప్పారు.

ఈ సమాచారం అందుకొన్న కాకినాడ టూ టౌన్ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని, కారును స్వాధీనం చేసుకొని సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ADVERTISEMENT
Latest Stories