విజయవాడ వరదలకి ప్రధాన కారణం బుడమేరుకి పలుచోట్ల గండ్లు పడటం. కనుక విజయవాడలో సహాయ, పునరావాస చర్యలు చేపడుతూనే, మరోపక్క వాటిని పూడ్చే బాధ్యత మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడికి సిఎం చంద్రబాబు నాయుడు అప్పగించారు. శనివారం మధ్యాహ్నమే వారిద్దరూ కలిసి బుడమేరులో గండ్లు పడిన ప్రాంతాలలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.
నారా లోకేష్ వాటికి అవసరమైన కార్మికులు, టిప్పర్లు, జేసీబీలు, కంకర, ఇసుక బస్తాలు వగైరాలను ఏర్పాటు చేసి పంపిస్తుంటే, నిమ్మల రామానాయుడు గండ్లు పూడ్చివేత పనులను పర్యవేక్షించారు. శనివారం అర్దరాత్రి ఓ పక్క జోరుగా వర్షం పడుతున్నా మంత్రి నిమ్మల అక్కడి నుంచి కదలకుండా దగ్గరుండి ప్రతీ గండినీ పూడ్పించారు. బుడమేరు గండ్లు ఒకటొకటిగా పూడ్చివేస్తుంటే నగరంలోకి నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దాంతో సహాయ చర్యలు మరింత వేగవంతం అయ్యాయి. బుధవారం సాయంత్రానికే నగరంలో చాలా ప్రాంతాలు సాధారణ స్థితికి వచ్చాయి.
బుడమేరు గేట్లు ఎత్తేయడం వలననే విజయవాడ నగరం మునిగిపోయిందని మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేయడంతో దాని గురించి ఆరా తీసేందుకు బయలుదేరిన ఓ మీడియా ప్రతినిధికి, అర్దరాత్రి కుండపోతగా కురుస్తున్న వానలో బుడమేరు దగ్గర నిలబడి గండ్లు పూడ్పిస్తున్న మంత్రి నిమ్మల కనబడ్డారు. ఆ సమయంలో ఆయనని అక్కడ చూసి మీడియా ప్రతినిధి కూడా ఆశ్చర్యపోయారు.
అతనితో మంత్రి నిమ్మల మాట్లాడుతూ, “బుడమేరుకి కుడి, ఎడమ గట్లు రెండువైపులా అనేక చోట్ల గండ్లు పడ్డాయి. వాటిని పూడ్చనంత వరకు విజయవాడ నగరంలోకి నీళ్ళు ప్రవహిస్తూనే ఉంటాయి. కనుక సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు నేనూ, నారా లోకేష్ ఇద్దరం కలిసి యుద్ధప్రాతిపదికన ఈ పని పూర్తి చేస్తున్నాము.
నారా లోకేష్ మాకు అవసరమైన ఏర్పాట్లు చేసి అందిస్తుంటే మేము ఇక్కడ గండ్లు పూడ్చుతున్నాము. ఇక్కడ ఈ గండ్లు పూడ్చితేనే నగరంలో వరద ప్రవాహాన్ని కట్టడి చేయగలము,” అంటూ బుడమేరు గండ్లు పూడ్చివేతకి తాము చేస్తున్న పనుల గురించి వివరించారు.




