‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆడియో వేడుకలో దర్శకుడు క్రిష్ చేసిన ప్రసంగం మైదానంలో ఉన్న నందమూరి అభిమానులనే కాదు, టీవీలలో వీక్షించిన వారిని కూడా ఉద్వేగభరితుల్ని చేసింది. అమ్మ మీద, భార్య మీద ప్రమాణం చేస్తూ మొదలుపెట్టిన ఈ ప్రసంగం చివరికి వచ్చేపాటికి బాగా ఏమోషనల్ అయిన క్రిష్… ఈ సంక్రాంతికి వస్తున్నాము… తెలుగు వాడి పౌరుషం ఏంటో చాటిచెప్తాం… ఖబడ్దార్… అంటూ ముగించారు. ఇది అన్న తర్వాత కూడా నా మీద ప్రస్తుతం బోయపాటి ప్రభావం పడిందనుకుంటా… అంటూ చమత్కరించారు.
ఇది జరిగి రెండు రోజులు పూర్తయ్యింది. అయితే ఆ చివరన క్రిష్ పలికిన ‘ఖబడ్దార్’ అనే మాట సంక్రాంతికి విడుదల కాబోతున్న ‘ఖైదీ నంబర్ 150’కి సంబంధించేనని, మెగాస్టార్ చిరంజీవి సినిమా రీమేక్ కావడంతో, తెలుగువాడి సత్తాను నిరూపించే విధంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని తీసి విడుదల చేస్తున్నందుకు ‘ఖబడ్దార్’ అని క్రిష్ అన్నట్లుగా పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇది సోషల్ అండ్ వెబ్ మీడియాలలో హైలైట్స్ కావడంతో… దానికి మరలా దర్శకుడు క్రిష్ వివరణ ఇచ్చుకోక తప్పలేదు.
“నా మాటలను అలా తప్పుగా ప్రచారం చేయవద్దు, గత కొన్ని సంవత్సరాలుగా మద్రాసీలో బ్రతుకుతున్న తెలుగు వారికి అండగా ఉండేందుకు మాత్రమే ఆ పదాన్ని వినియోగించానని, ఇది హృదయపూర్వకంగా చెప్తున్న మాట అని, అయినా తన రెండవ సినిమా ‘వేదం’ను క్లోజ్ ఫ్రెండ్ అయిన అల్లు అర్జున్ తో తీసానని, నాలుగవ సినిమాను మరో మెగా హీరో వరుణ్ తేజ్ తో ‘కంచె’ తెరకెక్కించానని, ఇండస్ట్రీలోకి రాక ముందు నుండి రామ్ చరణ్ తో తానూ చాలా సన్నిహితంగా ఉండేవాడినని” చెప్పుకొచ్చారు.
“చిరంజీవి గారు చాలా గొప్ప వ్యక్తి, ‘కంచె’ విడుదలైన సమయంలో తన ఇంటికి ఆహ్వానించి, తనను కౌగలించుకుని, ఒక్కో సీన్ ఒక్కో సీన్ చెప్తూ ఎంజాయ్ చేసారని, నా కెరీర్ కు చిరంజీవి స్పూర్తిదాయకమైన వ్యక్తి అని, తన మాటలను ఆ విధంగా భావించవద్దు… కృతజ్ఞతలు…” అంటూ క్రిష్ వివరణ ఇచ్చుకున్నారు. మొత్తానికి బోయపాటి ప్రభావం వలన వచ్చిన డైలాగ్స్ క్రిష్ కు ఎన్ని తిప్పలు తెచ్చిపెట్టాయో స్పష్టమైంది. వివాదాలకు తావివ్వకుండా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చరిత్రను అన్ని వర్గాల వారికి చేరువయ్యే ప్రయత్నాలను క్రిష్ బాగానే చేపడుతున్నట్లున్నారు.



