టిడిపికి గంట అవసరమా?

Ganta Srinivasa Rao టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇదివరకు మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో చక్రం తిప్పేవారు. కానీ టిడిపి ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలో చేరేందుకు ఆయన ప్రయత్నించారు కానీ ఆ పార్టీ నేతలు అభ్యంతరం చెపుతుండటంతో చేరలేకపోయారు.

గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరలేకపోయినప్పటికీ నేటికీ టిడిపికి దూరంగానే ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లా పర్యటనలకి వచ్చినప్పుడు సైతం మొహం చాటేస్తున్నారు. టిడిపిలో యాక్టివ్‌గా ఉంటే వైసీపీ ప్రభుత్వం నుంచి తన కంపెనీలకి, రాజకీయంగా తనకీ ఇబ్బందులు ఎదుర్కోవలసివస్తుందనే భయం వల్లకావచ్చు.

ADVERTISEMENT

అయితే టిడిపిలో చాలా మంది నాయకులకి కాంట్రాక్టులు, వ్యాపారాలు ఉన్నాయి. అలాగని వారందరూ టిడిపికి దూరంగా ఉండటం లేదు. వైసీపీ ప్రభుత్వం నుంచి, వైసీపీ నేతల నుంచి ఎన్ని సవాళ్ళు, సమస్యలు ఎదురవుతున్నా టిడిపినే అంటిపెట్టుకొని ఉంటూ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. పార్టీకి పూర్వవైభవం సాధించేందుకు ఎన్ని కష్టాలు, త్యాగాలకైనా సిద్దమని చెపుతుంటారు.

గంటా శ్రీనివాసరావు పార్టీకి దూరంగా ఉంటున్నప్పటికీ ఆయన ఆర్ధికంగా, రాజకీయంగా, కులపరంగా బలమైన నాయకుడు కనుక టిడిపికి ఆయనని వదులుకోవాలనుకోవడం లేదు. బహుశః అందుకే టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ఆహ్వానం మేరకు ఆయన ఈరోజు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. టిడిపి కూడా కాపు సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది కనుక బహుశః అందుకే నారా లోకేష్‌ ఆయనతో భేటీ అయ్యుండవచ్చు.

వారివురూ ఏం చర్చించారో తెలీదు కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడనివాడు ఎంత గొప్పవాడైనప్పటికీ, రాజకీయంగా ఎంత బలమున్నప్పట్టికీ అటువంటివారి వలన పార్టీకి ఉపయోగం ఉండబోదని ఆయనే నిరూపించి చూపుతున్నారు కదా?అయినా టిడిపి ఆయన కోసం తాపత్రయపడటం దేనికి?

ఈ సందర్భంగా సుమతీ శతకంలో ఓ పద్యం గుర్తుచేసుకోవలసి ఉంటుంది.

అక్కరకు రాని చుట్టము…. మ్రొక్కిన వరమీని వేల్పు, మొహారమున దానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ.

దీని అర్దం ఏమిటంటే అవసరానికి ఉపయోగపడని చుట్టాన్ని, దణ్ణం పెట్టి ప్రార్ధించినప్పటికీ కరుణించని దేవుడిని, యుద్ధ సమయంలో ముందుకు సాగని గుర్రాన్ని వెంటనే విడిచిపెట్టవలెను.

ఈ కష్టకాలంలో టిడిపిలో అనేకమంది యువనాయకులు ఉత్సాహంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. శాయాశక్తులా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అటువంటి యువనాయకులని టిడిపి అధిష్టానం ప్రోత్సహించి రాజకీయంగా ఎదిగేందుకు సహకరిస్తే వారి ద్వారా టిడిపికి పూర్వవైభవం సాదించగలదు. కానీ యుద్ధంలో సహకరించనప్పుడు అది ఎంత బలమైన గుర్రమైనప్పటికీ దాని వలన టిడిపికి ప్రయోజనం ఉండదు.

ADVERTISEMENT
Latest Stories