ఇప్పుడు హైద్రాబాద్ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అనే కన్నా హైడ్రా తో బుల్డోజర్లు పరుగెడుతున్నాయి అనడం సమంజసమేమో అన్నటుగా హైడ్రా హైద్రాబాద్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
ఎప్పుడు ఏ బుల్డోజర్ తమ ఇంటి మీదకు వస్తుందో అన్న భయం గుప్పిట్లో నిద్ర లేస్తున్నారు హైద్రాబాద్ లోని కొన్ని ఏరియాల ప్రజలు. ఇప్పటికే మాదాపూర్, అమీన్ పూర్, దుండిగల్ ప్రాంతాల సరస్సులలోని ఫుల్ ట్యాంక్ లెవెల్(FTL), బఫర్ జోన్ లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చి వేసింది హైడ్రా.
అయితే హైడ్రా దూకుడుతో ప్రకృతి ప్రేమికులు ప్రభుత్వానికి మద్దతు పలుకుతుంటే, హైడ్రా చర్యలతో తమ జీవితాలు రోడ్డున పడుతున్నాయి అంటూ విలపిస్తున్నారు సాధారణ మధ్యతరగతి ప్రజలు. తాము చేయని తప్పుకి, తమకు సంబంధం లేని నేరానికి ప్రభుత్వం తమను శిక్షిస్తుంది అనే భావనకు వచ్చేసాయి మధ్యతరగతి కుటుంబాలు.
ప్రభుత్వానికి కట్టాల్సిన అన్ని టాక్స్ లు చెల్లించి, ఆస్తి పన్నులు కడుతూ, బ్యాంకు అప్రూవల్స్ తో లోన్స్ తీసుకుని, రిజస్టర్ చేసుకున్న మా ఆస్తులను ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చడం అన్యాయమంటూ రోడ్డెక్కారు సున్నం చెరువు ప్రాంతాల ప్రజలు.
ప్రభుత్వం మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే మా ఇళ్లను ఉన్న పాలంగా ఖాళీ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చి, ఆ మరుక్షణంలో కూల్చివేతలను మొదలుపెడుతున్నారు అంటూ ప్రభుత్వ చర్యలను తప్పుపట్టారు.
ఈ ఇళ్ల నిర్మాణాలకు అనుమతిలిచ్చిన అధికారులను, కరెంట్, వాటర్ సప్లై చేసిన వ్యవస్థలను వదిలి పెట్టి మాలంటి సామాన్యుల మీద మీ ప్రభుత్వ జులం అంటూ హైడ్రా అధికారులతో వాగ్వాదనకు దిగుతున్నారు స్థానికులు.
అయితే వారి వాదనలో కూడా న్యాయం లేకపోలేదు. ప్రభుత్వ ధికారులు ఇచ్చిన అనుమతులతోనే ఈ ఇళ్ల నిర్మాణాలకు పునాది పడింది. అయితే అప్పుడు కాసులకు కక్రుత్తి పడి సంతకాలు చేసి నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అధికారులు ఇప్పడు సేఫ్ జోన్ లో ఉంటూ బాధితులను బఫర్ జోన్లో పడేసారు.
జీవితాంతం కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సొమ్ముతో నిర్మించుకున్న నిర్మాణాలు కళ్ళ ముందే కూలిపోతుంటే కడుపు మంటతో ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు బాధితులు.
అయితే ఈ హైడ్రా నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి చేస్తుందా.? చెడు చేస్తుందా ..? అని ఆలోచించే ముందు అసలు ఇటువంటి ప్రాంతాలలో నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారుల పైన కూడా రేవంత్ ఇంతే కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోగలిగితే ఇక భవిష్యత్ లో హైడ్రా వంటి వ్యవస్థలతో అవసరం రాకపోవచ్చు.
అలాగే ఇలా ఎన్ని కుటుంబాలు తమ సర్వస్వం కోల్పోయాము అనే బాధలో రోడ్డు పైన పడే పరిస్థితులు చూడకపోవచ్చు. అయితే ఈ కూల్చివేతల పట్ల మధ్యతరగతి ప్రజలలో వ్యక్తమవుతున్న వ్యతిరేకతతో హైడ్రా కూడా కాస్త వెనక్కి తగ్గినట్టే ఉంది. ఇప్పటికే నివాసప్రాంతాలుగా మారిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేయదు అంటూ ప్రకటించారు హైడ్రా చీఫ్ రంగనాధ్.
ఈ ప్రకటనతో కాస్త ఊపిరిపీల్చుకున్నారు ఆయా ప్రాంతాల ప్రజలు. అయితే ఇక భవిష్యత్ లో హైద్రాబాద్ లో ఎవరైనా స్థలం లేదా ఆస్తి లాంటి భవనాలు కొనుగోలు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, ఆతరువాత జరిగే పరిణామాలతో బాధపడితే లాభం లేదని హెచ్చరించారు రంగనాధ్.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో భాద్యులెవ్వరు.? అనేది ఒకసారి పరిశీలిస్తే.., ఒక ప్రభుత్వంలో సక్రమమైనది మరో ప్రభుత్వమో అక్రమం ఎలా అవుతుంది.? ఒక అధికారి చట్టబద్ధమే అని సంతకం పెట్టాకా మరో అధికారి దానిని చట్ట వ్యతిరేకం అనడంలో ఆ నేరమెవ్వరిదీ.? ఈ కూల్చివేతలకు ఎవరిని నిందించాలి.? చూసి చూడకుండా చేతులు దులుపుకున్న గత పాలకుల నిర్లక్ష్యమనాలా.? లంచాలకు అలవాటు పడిన వ్య్వస్థలదా.?
ఇవి ప్రభుత్వాల, అధికారుల తప్పిదాలు కాదా.? ఈ నేరానికి వారు శిక్షార్హులు కారా.? హైడ్రా తో రేవంత్ సర్కార్ తెలియక తప్పు చేసిన వారిని శిక్షించడం కాదు తప్పు అని తెలిసి అనుమతులిచ్చిన వారి పై చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉన్నట్లు అవుతుంది.
ఇటువంటి నిర్ణయాలతో ప్రభుత్వాలు ప్రజల ముందుకెళితే ఖచ్చితంగా వారి దగ్గర నుండిప్రభుత్వాలకు సానుకూల స్పందన వస్తుంది. అలాకాకుండా బాధితులనే దోషులుగా చిత్రీకరిస్తే అసలు నేరస్తులు మళ్ళీ బల్ల కింద చేతులు పెట్టి మధ్యతరగతి బతుకులను కూలుస్తునే ఉంటారు.
ఒక తప్పుని సరిదిద్దేటప్పుడు ప్రభుత్వాలు దాని పునాది నుండి సవరణలు మొదలుపెడితే హైడ్రా లాంటి వ్యవస్థకు సమాధి కట్టినట్టే. అయితే ఈ హైడ్రా చర్యలతో ప్రభుత్వానికి దక్కిందేమిటి.? ప్రజలకు పోయిందేంటి.? అనేది తెలియాలంటే హైద్రాబాద్ లో GHMC ఎన్నికలు జరగాల్సిందే.
వాటి ఫలితాలతో హైడ్రా ఫలితాలు బయటపడతాయి. హైడ్రా నిర్ణయంతో హైద్రాబాద్ లో రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెడుతారా.? లేక కూలుస్తారా.? రానున్న రోజులలో తేలిపోతుంది.




