ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పని కత్తిమీద సాము వంటిదే. ప్రభుత్వం చెప్పినట్లు పనిచేయాలి. కానీ అధికార, ప్రతిపక్ష పార్టీలలో ఎవరికీ కోపం కలిగించకూడదు. సాధ్యమా? కాదు.
కనుక కొందరు నిబంధనల ప్రకారం పని చేసుకుపోతూ బదిలీలు వేట్లు వేయించుకుంటారు. కానీ కొందరు ప్రభుత్వం ఎలా చెపితే తూచా తప్పకుండా పనిచేస్తుంటారు. ఆ క్రమంలో నిబంధనలు పక్కన పెడుతుంటారు. ప్రతిపక్షనేతలకు ఇబ్బంది, ఆగ్రహం కలిగించే నిర్ణయాలు అమలు చేస్తుంటారు.
మొసళ్ళ చెరువులో జీవించే చేపలకు అనుక్షణం ప్రమాదం పొంచి ఉంటుంది. వాటి నుంచి తప్పించుకుంటూనే జీవించాల్సి ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులలో అలాంటి లౌక్యం, తెలివి తేటలు కొద్ది మందికే ఉంటాయి. అలాంటివారు ఏ పార్టీ, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తెలివిగా బ్రతికేయగలరు.
కానీ కొందరు తాము ఐఏఎస్, ఐపీఎస్ అధికారులమనే విషయం మరిచిపోయి, పార్టీలకు కొమ్ము కాస్తుంటారు. పార్టీల కండువాలు కప్పుకోవడం తప్ప మిగిలినదంతా అచ్చమైన పార్టీ నేత లేదా క్రమశిక్షణ కలిగిన కార్యకర్త మాదిరిగానే వ్యవహరిస్తుంటారు. అలాంటివారే ప్రభుత్వం మారినప్పుడు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
గతంలో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు ఆవిధంగానే వ్యవహరించారని జగన్ ఆయనపై కత్తి కట్టి 5 ఏళ్ళ పాటు ముప్పతిప్పలు పెట్టారు. ఇప్పుడు వైసీపీ విధేయులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వంతు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే అలాంటి వారిని ఏరి పక్కన పెట్టేసింది.
వారిలో ఓవర్ యాక్షన్ చేసిన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌పై కూటమి ప్రభుత్వం సస్పెన్షన్ పొడిగించింది. ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులు విచారణ పూర్తయ్యే వరకు లేదా పదవీ విరమణ వరకు ఏది ముందైతే అంత వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అంటే ఇక ఆయనకు ఇక ఆ పదవి ఎన్నటికీ దక్కదన్న మాట! దీనిపై ఆయన కూడా ఏబీ లాగే న్యాయపోరాటాలు చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం వద్దనుకుంటే పదవి దక్కించుకోవడం అసాధ్యమని, దక్కించుకున్నా అది మూన్నాళ్ళ ముచ్చటే అని ఏబీ విషయంలో నిరూపితమైంది.
ఇలాంటి పరిస్థితులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రమే కాదు… యావత్ దేశంలోనే ఉన్నాయి. కనుక ఈ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకొని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏవిధంగా పనిచేయాలి? అందుకు కొత్తగా ఎటువంటి నియమ నిబంధనలు, శిక్షణ, రక్షణ అవసరం? అని వారికి శిక్షణ ఇచ్చి తయారుచేస్తున్న రెండు అకాడమీలు ఆలోచించాల్సిన సమయం ఇదే!




