జగన్‌కు పూర్తి క్లారిటీ ఉంది… మంచిదే!

Jagan Mohan Reddy reiterating his stand on Amaravati capital as Chandrababu Naidu accelerates construction works

ఏపీ రాజధాని విషయంలో సిఎం చంద్రబాబు నాయుడుకి ఎంత స్పష్టత ఉందో, మాజీ సిఎం జగన్‌కి కూడా అంత స్పష్టత ఉందని నిన్న మరోసారి తేలిపోయింది. రాజధాని విషయంలో ఇద్దరికీ ఏకాభిప్రాయం లేకపోవచ్చు కానీ ఇంత స్పష్టత ఉండటం మంచిదే. ముఖ్యంగా జగన్‌కి చాలా అవసరమే.

రెండు మూడు నెలల క్రితం అమరావతిపై చర్చ మొదలైనప్పుడు, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మూడు రాజధానులపై పార్టీలో అంతర్గతంగా చర్చించుకొని తమ వైఖరి తెలియజేస్తామన్నారు.

ADVERTISEMENT

మూడు రాజధానులు చాలా అవసరమని గట్టిగా వాదించిన వైసీపీ, పునరాలోచించుకోవడం అంటే తమ ఆలోచన, విధానంలో లోపం ఉందని గ్రహించిందని అందరూ అనుకున్నారు.

కానీ ఈ విషయంలో తమ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని జగన్‌ నిన్న కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. నేటికీ అమరావతిని రాజధానిగా అంగీకరించడం లేదని మరోమారు స్పష్టం చేశారు.

అమరావతి విషయంలో జగన్‌ భిన్నాభిప్రాయం కలిగి ఉండటం తప్పు కాదు. కానీ తొలి నుంచే ఈ వైఖరితో ఉంటే నేడు ఎవరూ ఆయనని తప్పు పట్టేవారు కారు. కానీ మద్యలో 2019 ఎన్నికల కోసం మాట మర్చి అమరావతికి జై కొట్టారు. గెలిచాక అమరావతిని నిర్దాక్షిణ్యంగా పాడు బెట్టేశారు. అందుకు మూల్యం చెల్లించారు. తమ ఓటమికి అమరావతి కూడా ఓ కారణమని తెలిసి ఉన్నప్పటికీ జగన్‌ మళ్ళీ వ్యతిరేకిస్తున్నారు.

జగన్‌ అమరావతిని ఇంతగా వ్యతిరేకిస్తున్నారు కనుకనే సిఎం చంద్రబాబు నాయుడు దానిని మరింత వేగంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి నిర్మాణ పనులు పూర్తిచేసి, అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన అమరావతిని ప్రజలకు చూపించి ఓట్లు అడగబోతున్నారు.

మరోపక్క అమరావతిని ఏపీకి శాశ్విత రాజధానిగా గుర్తిస్తూ విభజన చట్టంలో సవరణ చేయించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

జగన్‌కి ఇష్టం ఉన్నా లేకపోయినా అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూనే ఉంటాయి. కనుక ఒకవేళ జగన్‌ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈసారి దాదాపు నిర్మాణాలు పూర్తయిన అమరావతిని ఏం చేస్తారనేది?మిలియన్ డాలర్ ప్రశ్న.

ఏది ఏమైనప్పటికీ, జగన్‌ ఈసారైనా అమరావతి విషయంలో మాట మార్చకుండా వచ్చే ఎన్నికల వరకు ఇదే మాటకు కట్టుబడి ఉండాలి. అప్పుడు రాష్ట్రానికి అమరావతి అవసరమా లేక జగన్‌ అవసరమా?అనేది ప్రజలే నిర్ణయిస్తారు.

ADVERTISEMENT
Latest Stories