ఏపీ తెలంగాణ ముఖ్య మంత్రులుగా చేసిన జగన్, కేసీఆర్ ఇద్దరూ యుద్ధ విమానాల్లా ఒకేసారి ఆకాశంలోకి దూసుకు వెళ్ళి ఒకేసారి కూలిపోవడం యాదృచ్చికమే కావచ్చు కానీ ఆశ్చర్యకరమే.
వారి గెలుపోటములు మాత్రమే కాదు… ఓటమి తర్వాత వారిద్దరి జీవితాలు, రాజకీయాలు, ఆలోచనలు, ఆశలు, కోర్కెలు, మాటలు అన్నీ కూడా ఇంచుమించు ఒకేలా ఉండటం కూడా యాదృచ్చికమే… ఆశ్చర్యకరమే!
ఇద్దరూ ఇంట్లో నుంచి బయటకు రాకుండా వచ్చే ఎన్నికలలో గెలిచి నేరుగా సచివాలయంలో ముఖ్యమంత్రి ఛాంబర్‌లోకి వెళ్ళిపోదామని అనుకుంటున్నారు.
జగన్ అవకాశం చిక్కినప్పుడల్లా, ‘మళ్ళీ మనమే… రప్పా రప్పా,’ అంటూనే ఉన్నారు. కానీ కేసీఆర్ తరపున కేటీఆర్ ‘మళ్ళీ మనమే’ పాట పాడుతున్నారు.
శుక్రవారం ఫామ్‌హౌసుకి వచ్చిన సర్పంచులతో కేసీఆర్ మాట్లాడుతూ, “ఎవరూ అధైర్యపడొద్దు. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అంతవరకు అందరూ ఓపిక పట్టండి,” అని అన్నారు.
శాసనసభకు, ప్రజల మధ్యకు, కనీసం పార్టీ కార్యాలయానికి రాకుండా రెండేళ్లుగా ఫామ్‌హౌసులోనే కేసీఆర్ కాలక్షేపం చేస్తున్నారు.
“ఆయన గోడకి వ్రేలాడదీసిన తుపాకీ… సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పక ఆ తుపాకీ పేలుతుంది,” అని తండ్రిని కేటీఆర్ తన వాక్చాతుర్యంతో చక్కగా సమర్ధించుకున్నారు. కానీ కేసీఆర్ ఇప్పుడప్పుడే బయటకు రారని ఆయన చెప్పకనే చెప్పారని అర్ధమవుతూనే ఉంది.
కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీని గెలిగిపించుకోలేకపోయారు. ఆయన నాయకత్వాన్ని చెల్లి కల్వకుంట్ల కవిత కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రాగలమని ఎలా అనుకుంటున్నారు? అనే సందేహం కలుగుతుంది.
రేవంత్ రెడ్డి పాలనతో విసిగిపోయిన ప్రజలు మళ్ళీ తనకు పట్టం కడతారని నమ్ముతున్నారా?లేదా వచ్చే ఎన్నికల నాటికి బీజేపిలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయాలనుకుంటున్నారా? లేదా పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారా?
రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటామని కేంద్రం హామీ ఇచ్చిందా? అనే సందేహాలు కలుగుతాయి. లేకుంటే తాను, తన ఆరోగ్యం, పార్టీ పరిస్థితి ఈవిధంగా ఉన్నప్పుడు ‘మళ్ళీ మనమే’ అని కేసీఆర్ ఎలా అనగారు?
బీఆర్ఎస్ పార్టీకి ఇన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ వైసీపీకి ఇటువంటి అవకాశాలు ఏవీ లేకపోగా కూటమి పార్టీల మద్య, అలాగే మోడీ-చంద్రబాబు మద్య బంధాలు మరింత బలపడుతున్నాయి. మరి జగన్ రప్పా రప్పాకి ఆధారం, నమ్మకం ఏమిటో?






