వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయ విధానాలు ఒక్కోసారి పార్టీ శ్రేణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. రాజమండ్రిలో హిట్ అండ్ రన్ కేసులో ప్రాణాలు కోల్పోయిన ప్రియాంక కోసం పార్టీ తరుపున న్యాయ పోరాటం చేస్తా అంటూ నిన్న ప్రియాంక పేరెంట్స్ కి హామీ ఇచ్చిన జగన్,
నేడు శ్రేకాకుళం జిల్లాలో అదే హిట్ రన్ కేసులో దానయ్య అనే గొర్రెల కాపరి చావుకి కారణమైన సిదిరి కుటుంబాన్ని కలిశారు. అక్కడ బాధితులకు న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చిన జగన్ ఇక్కడ నిందితులకు అండగా ఉంటామంటూ భరోసా ఇస్తున్నారు.
రాజమండ్రిలో తప్పు శ్రీకాకుళం ఒప్పు ఎలా అవుతుంది అన్న ప్రశ్నకు మాత్రం జగన్ దగ్గరే కాదు వైసీపీ శ్రేణుల దగ్గర కూడా జవాబు దొరక్కపోవచ్చు. ఇక్కడ ప్రియాంక కుటుంబాన్ని ఓదార్చిన జగన్ అక్కడ దానయ్య కుటుంబాన్ని పక్కన పెట్టి సిదిరి కుటుంబాన్ని పరామర్శించారు.
హిట్ అండ్ రన్ బైక్ తో చేస్తే ఒక న్యాయం కారు తో చేస్తే మరో న్యాయమా.? అంటే ఇక్కడ మనిషి ప్రాణం కన్నా వాహనమే కీలక పాత్ర పోషిస్తుందా.? ఇక్కడ ప్రియాంక కుటుంబానికి కలిగిన బాధ, ఆవేదన అక్కడ దానయ్య కుటుంబానికి కూడా కలిగే ఉంటుందిగా.?
ప్రియాంక కుటుంబం కోరుకునే న్యాయం దానయ్య కుటుంబానికి కూడా హక్కే అన్న సంగతి వైసీపీ ఎప్పటికి గ్రహిస్తుంది. అక్కడ ప్రభుత్వం కక్ష సాధించింది అంటూ తప్పుని ఒప్పుగా చిత్రీకరిస్తున్న వైసీపీ ఇక్కడ ప్రభుత్వం చర్యలకు ఆదేశించినా ప్రభుత్వం అసమర్ధత అంటూ వేలెత్తి చూపుతుంది. దీనితో జగన్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి.





