ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో అటు కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఇటు వైసీపీ ఎవరికీ వారు తమ పార్టీ లీడర్లను, క్యాడర్లను సమరానికి సిద్ధం చేస్తున్నారు.
పట్టు కోసం కూటమి, పరువు కోసం వైసీపీ ఇద్దరు కూడా రాజకీయంగా పై చేయి సాధించాలని ఆశపడుతున్నారు. అయితే ఇక్కడ స్థానిక ఎన్నికల గెలుపు వైసీపీ కి ఎంత అవసరమో అటు కూటమి కూడా అంతే కీలకం కానుంది. మూడు పార్టీల రాజకీయ పొత్తు మరో పదిహేనేళ్ళు ఇలానే కొనసాగాలని, కొనసాగుతుందని పార్టీల అధినేతలు పదేపదే ప్రకటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా ఈ మూడు పార్టీల మధ్య రాజకీయ చిచ్చు రాకుండా స్థానిక సమరానికి సిద్దమవ్వడం కూటమి కూడా కత్తి మీద సాము వంటిందే. ఇప్పటికే జనసేన స్థానిక ఎన్నికలలో తమ రాజకీయ బలం మరింత పెరగనుందని, సార్వత్రిక ఎన్నికల మాదిరి కాకూండా ఈ సారి పార్టీ తనకు క్షేత్ర స్థాయిలో బలమున్న స్థానాలలో ఖచ్చితంగా పోటీ చేస్తుందంటూ పార్టీ ముఖ్య నేతలు ప్రకటించారు.
దీనితో జనసేన తరుపున టికెట్ ఆశించే వారి సంఖ్య పెద్దగానే కనిపిస్తుంది. ఇటు బీజేపీ కూడా పొత్తులో భాగంగా స్థానికంగా తమ పార్టీ బలం పెంచుకునేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని తమ అవసరంగా మలుచుకునేందుకు వెనుకాడదు.
అలాగే క్షేత్ర స్థాయిలో బలమైన రాజకీయ పార్టీగా పునాదులు వేసుకున్న టీడీపీ కూడా తమ పార్టీ కింద స్థాయి నాయకులను సంతృప్తి పరచాల్సి ఉంటుంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం వైసీపీ తో పోరాడిన నేతలను, పార్టీ రాజకీయ భవిష్యత్ కోసం తమ ప్రాణాలు అడ్డుపెట్టిన క్యాడర్ కోసం చెయ్యాల్సింది చాలానే ఉంది.
కాబట్టి ఈ మూడు పార్టీల అధినేతలకు ముఖ్యంగా టీడీపీ, జనసేన అధినేతలకు కూటమి పొత్తుకు కట్టుబడి పార్టీ నేతలను సంతృప్తి పరచడం కత్తి మీద సాము వంటిందే అవుతుంది. మూడు పార్టీల మధ్య ఎటువంటి రాజకీయ విభేదాలు రాకుండా, స్థానిక ఎన్నికలను కూడా సార్వత్రిక ఎన్నికల పార్టీ – 2 గా మలిచేందుకు ఇరుపార్టీల లీడర్ల తో పాటుగా క్యాడర్ కూడా ముందుకు రావాలి.
అలాగే ఇటు వైసీపీ విషయంలో కూడా ఈ ఎన్నికలు అంతే కీలకం కానున్నాయి. జగన్ పరామర్శల పర్యటనలు, ఓదార్పు యాత్రలు..ఇలా జగన్ బయటకనిపిస్తే చాలు జై జగన్ అంటూ జగన్ ను చుట్టుముడుతున్న జనసంద్రం బలప్రదర్శన కాదు పార్టీ బలం అని నిరూపించేందుకు జగన్ కి ఈ ఎన్నికలు అత్యంత కీలకం.
జగన్ మావిగన్ నినాదం నుంచి వైసీపీ డీఎస్సీ పోరాటాల వరకు ప్రజలు ఎవరి వెంట నడుస్తున్నారు, ఎవరి రాజకీయాన్ని కోరుకుంటున్నారు అనేదానికి ఈ స్థానిక ఎన్నికల ఫలితాలు ఒక రిఫరెండం గా మారనున్నాయి. దీనితో వైసీపీ రప్ప రప్ప రాజకీయాలను ప్రజలు ప్రోత్సహిస్తున్నారా.? లేదా కూటమి అభివృద్ధి మంత్రానికే జై కొట్టనున్నారా అనేది తేలిపోనుంది.





