తెలుగు సినీ చరిత్రలో కొందరు నటీనటుల పేర్లు తలచుకున్నప్పుడు ఓ శకమే సినిమా రీలులా కదులుతుంది. సావిత్రి, అంజలీదేవి, జమున వంటి అగ్ర కథానాయికలు సినీ పరిశ్రమను ఏలుతున్న రోజులలోనే వారితో పోటీ పడుతూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి షావుకారు జానకి.
దాదాపు ఏడు దశాబ్దాల సినీ ప్రస్థానానికి ముగింపు పలుకుతూ ఆమె గత కొంత కాలంగా వృద్ధాప్య, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న షావుకారు జానకి (94) ఈరోజు మధ్యాహ్నం చెన్నైలో కన్నుమూశారు.
రాజమండ్రిలో జన్మించిన జానకి చిన్న వయసులోనే రేడియో, రంగస్థలంపై అడుగుపెట్టారు. 1950లో ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ‘షావుకారు’తో వెండితెరకు పరిచయమై.. ఆ సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు.
ఆ తర్వాత ‘రోజులు మారాయి’, ‘కన్యాశుల్కం’, ‘జయం మనదే’, ‘పాండురంగ మహాత్మ్యం’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘అక్కాచెల్లెలు’, ‘బడి పంతులు’, ‘తాయారమ్మ బంగారయ్య’, ‘సంసారం ఒక చదరంగం’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు.
సావిత్రి, జమున వంటి నటీమణులతో సమానంగా అగ్ర కథానాయికగా కొనసాగిన ఆమె.. వయసు పెరిగేకొద్దీ పాత్రల స్వభావాన్ని మార్చుకుంటూ సుదీర్ఘ నట జీవితాన్ని కొనసాగించారు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 400 చిత్రాల్లో నటించిన జానకి.. రంగస్థలంపై కూడా వందలాది ప్రదర్శనలు ఇచ్చారు.
ఆమె నటనకు లభించిన గౌరవాల్లో 2022లో అందుకున్న పద్మశ్రీ అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. ఒక హీరోయిన్‌గా మొదలై క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారినా తన స్థాయిని ఏమాత్రం తగ్గించుకోకుండా కొనసాగిన అరుదైన నటీమణుల్లో షావుకారు జానకి ఒకరు.
అందుకే ఆమె నిష్క్రమణ ఒక నటిని కోల్పోవడం మాత్రమే కాదు.. తెలుగు, దక్షిణ భారత సినీ చరిత్రలో ఒక సుదీర్ఘ అధ్యాయానికి ముగింపు.





