మాట తప్పడు మడం తిప్పడు అంటూ వైసీపీ శ్రేణులు వైస్ జగన్ ను ఉద్దేశించి చేసే ప్రశంసలు రోజులు గడిచే కొద్ది కరిగిపోతున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదానే వైసీపీ లక్ష్యం అంటూ నాడు పోరాటాలు చేసిన జగన్ అటు పిమ్మట హోదా కోసం నేను కేంద్రంతో పోరాడలేను అంటూ మడం తిప్పారు.
ఇక నారాసుర రక్త చరిత్ర అంటూ నాడు కథనాలు ప్రచారం చేసిన వైసీపీ ఆ తరువాత వివేకా హత్యలో సొంత కుటుంబ సభ్యుల హస్తం ఉందంటూ మాట తిప్పారు. రాజధాని అమరావతి అంటూ నాడు మాట ఇచ్చిన జగన్ ఆ తరువాత మూడు రాజధానులు అంటూ మడం తిప్పారు.
అలాగే రాష్ట్రంలో మధ్య నిషేధం అంటూ నవరత్నాలలో హామీ ఇచ్చిన జగన్ ఆ తరువాత ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తుంది అంటూ ప్రకటించి మద్యాన్ని సంక్షేమ పథకాల అమలుకు ఒక ఆదాయవనరుగా మార్చుకున్నారు. అలాగే ఆ విషయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.
ఇక అధికారంలోకి వచ్చిన వారం రోజులకే సీపీఎస్ రద్దు అంటూ నాడు ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చిన జగన్ ఆ తరువాత చిన్నపిల్లోడిని తెలియక హామీ ఇచ్చాను, అది మా ప్రభుత్వంతో తేలే వ్యవహారం కాదంటూ తప్పుకున్నారు.
ఇలా జగన్ – వైసీపీ చాల అంశాలలో ప్రజలకిచ్చిన మాటను తప్పుతూ, ప్రజలకు ప్రచారం చేసిన మాటలను తిప్పుతూ రాజకీయంలో ఇచ్చిన మాటకు, చెప్పిన ప్రకటనకు ఒక విలువ ఉండవు అనేలా వ్యవహరించారు. అయితే ఇన్నాళ్లు మాట తప్పడం, మాట తిప్పడంలో ఆరితేరిన జగన్ ఇప్పుడు మాట దాటేయడంలో కూడా సిద్దహస్తుడయ్యారనిపిస్తుంది.
నేడు జగన్ తన తాడేపల్లి ప్యాలస్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర రాజధాని అమరావతి పై మీ అభిప్రాయం ఏంటి అంటూ మీడియా ప్రతినిధి అడగగా ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అవసరం లేదు అంటూ ఆ మాటను దాటేస్తూ ప్రెస్ మీట్ ని ముగించేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్.
అయితే జగన్ ఇప్పుడు మూడు రాజధానులు అంటూ తన ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడ్డాను అంటూ ప్రకటించినా, లేక పార్టీ ఘోర ఓటమితో తత్త్వం భోద పడింది, ప్రజాభిప్రాయానికి కట్టుబడి అమరావతే రాజధాని అంటూ నమ్మపలికినా ఆ రెండు ప్రకటనలు కూడా రాజకీయంగా వైసీపీ ని ఇరుకున పెట్టక మానవు.
మొదటి ప్రకటన విషయానికొస్తే, మూడు రాజధానులకే వైసీపీ కట్టుబడింది, అందులో విశాఖకే మా ప్రధమ ప్రాధాన్యం అంటే ప్రజా తీర్పుకి విలువ లేదా.? అయితే భవిష్యత్ లో వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి నిర్మాణాల పై పెట్టిన లక్షల కోట్ల ప్రజా ధనాన్ని తిరిగి సమాధి చేసేస్తారా.? అన్న అనుమానాలు మొదలవుతాయి.
అలా కాకుండా రెండో ప్రకటన సంగతి చూస్తే, అమరావతినే రాజధానిగా ఒప్పుకుంటున్నాం, ఆ ప్రాంతాన్నే రాజధానిగా కొనసాగిస్తాం అంటూ హామీ ఇచ్చినా ఆ విషయాన్ని విశ్వసించేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉండరు, ఎందుకంటే 2019 ఎన్నికల ముందు వైసీపీ నాయకుల నుంచి జగన్ వరకు ఇవే మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించి ఒక్క ఛాన్స్ అవకాశం పొందారు.
ఆ తరువాత జరిగిన పరిణామాలను వైసీపీ మరిచిపోయినా ఏపీ ప్రజలు మరిచిపోలేరు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర కూడా ఎన్నటికీ మరిచిపోదు. కాబట్టి జగన్ రాజధాని పై మాట చెప్పడం అంటే అది మంత్రం లా స్థిరంగా ఉండేది కాదు అని భావించాలేమో బహుశా.!






