వైసీపీకి జనసేన శుభవార్త.. త్వరలో!

Nadendla-Manoharఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న ఒకే ఒక అంశం జనసేన పొత్తులు! ఆ పార్టీ బిజెపితోనే కొనసాగుతుందా లేక టిడిపితో పొత్తులు పెట్టుకొంటుందా?ఒకవేళ టిడిపితో పొత్తులు పెట్టుకొంటే ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది?అని వైసీపీలో అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT

ఏదో విదంగా పవన్‌ కళ్యాణ్‌ని రెచ్చగొట్టి ఈ విషయాలు బయటపెట్టించాలని వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయన పొత్తులు, సీట్ల గురించి బయటపెట్టడం లేదు. అయితే వారు ఎదురుచూస్తున్న ఆ శుభదినం త్వరలోనే వస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ ఆదివారం ప్రకటించారు.

శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో సోమవారం యువశక్తి పేరిట జనసేన ఓ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ ఆదివారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో వైసీపీ కబందహస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విడిపించడమే లక్ష్యంగా మా పార్టీ సాగుతుంది. కనుక వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు మా పార్టీ గట్టిగా కృషి చేస్తుంది. త్వరలోనే పొత్తులపై ప్రకటన చేస్తాం,” అని అన్నారు.

ప్రస్తుతం జనసేన, బిజెపిలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రిగా తమకు ఆమోదమే అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు ఇటీవల ప్రకటించారు. కనుక జనసేనని దూరం చేసుకోవడానికి బిజెపి సిద్దంగా లేదని స్పష్టమవుతోంది. అయితే వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తామని నాదెండ్ల మనోహర్ నిన్న కూడా చెప్పారు. టిడిపి, బిజెపి, జనసేనలు మూడూ కలిస్తేనే అది సాధ్యం అవుతుంది. కానీ టిడిపితో తమకి పొత్తులు అవసరం లేదని బిజెపి తేల్చి చెప్పేసింది.

ఈ నేపధ్యంలో నాదెండ్ల మనోహర్ త్వరలో పొత్తుల గురించి త్వరలోనే నిర్ధిష్టమైన ప్రకటన చేస్తామని చెప్పడం చాలా ఆసక్తికరంగా మారింది. టిడిపితో పొత్తులు పెట్టుకోకుండా, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా నివారించాలంటే దానికి మరో మార్గం కనిపిస్తోంది. రెండు పార్టీలు ముందుగానే చర్చించుకొని ఎక్కడెక్కడ ఏయే పార్టీల అభ్యర్ధులను నిలబెట్టాలో నిర్ణయించుకొని బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక వచ్చే ఎన్నికలలో బిజెపి, జనసేనల పొత్తులు కొనసాగుతాయని, టిడిపితో పొత్తులు పెట్టుకోబోమని జనసేన ప్రకటించే అవకాశం ఉంది. మూడు పార్టీలు ఈవిదంగా పరస్పర అవగాహనతో పోటీ చేసినా వైసీపీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని వేరే చెప్పక్కరలేదు.

ADVERTISEMENT
Latest Stories