జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుదవారం మధ్యాహ్నం మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “అమలాపురంలో నిన్న జరిగిన అల్లర్లను తీవ్రంగా ఖండిస్తున్నాను. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు చిక్కుకోవడంతో ఆ ఘటనపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికే వైసీపీయే ఈ అల్లర్లు సృష్టించింది. ఓ వ్యక్తిని హత్య చేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేయగల నాయకులు మీ పార్టీలోనే ఉన్నారు. కనుకనే ప్రతిపక్షాలను దెబ్బ తీయడానికి ఈ అల్లర్లను మీరే సృష్టించారు.
అసలు మొదటే కోనసీమ జిల్లాకు డా.అంబేద్కర్ పేరు పెట్టి ఉంటే ఈ అల్లర్లు జరిగి ఉండేవి కావు కదా? మిగిలిన అన్ని జిల్లాలను ఏర్పాటు చేసి వాటికి పేర్లు పెట్టినప్పుడు ప్రజల నుంచి అభ్యంతరాలు తెలుసుకొనేందుకు నెల రోజులు సమయం ఇవ్వలేదు కానీ ఒక్క కోనసీమ జిల్లాకు మాత్రమే ఎందుకు ఇచ్చారు?ప్రజల మద్య ఈవిదంగా కుల చిచ్చు రగిలించాలనా?
నిన్న మంత్రి ఇంటిపై ఆందోళనకారులు దాడి చేసి నిప్పు పెడుతుంటే అక్కడే ఉన్న పోలీసులు వారిని ఎందుకు అడ్డుకోలేదు?పోలీసులు మంత్రిని ముందే తరలించారని వైసీపీ నేతలు చెపుతున్నారు. అంటే మంత్రి ఇంటిపై దాడి జరుగబోతోందని, ఆ ఇంటికి నిప్పు పెట్టబోతున్నారని ప్రభుత్వానికి, పోలీసులకు ముందే తెలుసా?అందుకే మంత్రిని తరలించి ఇంటిని ఆందోళనకారులకు అప్పగించేశారా?
అల్లర్ల వెనుక నేను, చంద్రబాబు నాయుడు ఉన్నామని పోలీసులు దర్యాప్తు జరుపక ముందే మీరు ఎలా చెపుతున్నారు? అంటే మమ్మల్ని ఈ కుట్రలో ఇరికించాలనే ముందే ప్రణాళిక సిద్దం చేసుకొన్నారా?ఈ అల్లర్లలో కీలకపాత్ర పోషించిన వైసీపీ నేత అన్యంసాయి సజ్జల, మంత్రి విశ్వరూప్‌తో దిగిన ఫోటోలను టిడిపి సీనియర్ నేత అచ్చన్నాయుడు విడుదల చేశారు కదా? ఆ ఆరోపణలపై మే సమాధానం ఏమిటి?
వైసీపీ ప్రభుత్వం వీలైతే రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించాలి కానీ ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు సృష్టించడం సరికాదు. దావోస్ సదస్సుకు వెళ్ళిన సిఎం జగన్మోహన్ రెడ్డి వీలైతే రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాది కల్పించాలి కానీ ఈవిదంగా ప్రజల మద్య కులమతాల పేరుతో చిచ్చు రగిలిచి దానిలో చలి కాచుకోవడం సరికాదు,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.



