ఆయన ఇంటి పేరు జేడీ అనే అనుకుంటారు అందరూ. కానీ కాదు వివి లక్ష్మినారాయణ. అలా చెపితే ఎవరాయన? అని అడుగుతారు. అదే జేడీ లక్ష్మినారాయణ అని చెపితే టక్కున అయన గురించి జనమే కధకధలు చెప్పేస్తారు.
ఆయన పుణ్యమాని అక్రమాస్తుల కేసులో ‘జగన్ సమేత’ చంచల్ గూడా జైల్లో 16 నెలలు గడపాల్సి వచ్చింది. ఆయన పుణ్యామాని అక్రమాస్తుల కేసులతో వందల మందికి ఉపాధి లభిస్తోంది. గుళ్ళో ఇత్తడి గంట ఎప్పుడు కొట్టినా కంగునే మ్రోగుతుంది. దానికి ఇంత ఇంట్రడక్షన్ దేనికంటారా? అవసరమే.
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టరుగా చేసి నేరస్తులను గడగడలాడించిన ఆయన ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. దేనికంటే, ఆయన సతీమణి ఊర్మిళకి సైబర్ క్రైమ్ నేరగాళ్ళు ఏకంగా రూ.2.58 కోట్లు కుచ్చుటోపీ పెట్టేశారు.
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు ఆర్జించ వచ్చని నమ్మించి రూ.2.58 కోట్లు పెట్టుబడి పెట్టించి కొట్టేశారు. తన భార్య సైబర్ నేరగాళ్ళ చేతిలో మోసపోయిందని తెలుసుకున్న వివి సారీ జేడీ లక్ష్మినారాయణ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఆ డబ్బు తిరిగి రాబట్టగలరో లేదో తెలీదు కానీ సైబర్ నేరగాళ్ళకు కారెవరూ అనర్హం అని మాత్రం స్పష్టమైంది. కనుక సోషల్ మీడియాలో “ఎవ్విరీ డే ఎట్ నైనో క్లాక్….” అంటూ స్టాక్ మార్కెట్ ఉచ్చు విసిరే వారి వలలో పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండటం మంచిది.







