ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత సీబీఐ విచారణని ఎదుర్కొన్న తర్వాత తెలంగాణ జాగృతి సంస్థని యాక్టివేట్ చేస్తుండటం విశేషం. జాగృతి అధ్వర్యంలో నిన్న ముషీరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె చాలా ఉద్వేగంగా ప్రసంగించారు. ఐటి, ఈడీ, సీబీఐ దాడులతో కేంద్ర ప్రభుత్వం భయపెట్టి లొంగదీసుకోవాలనుకొంటోందని, కానీ తెలంగాణ ఆడపిల్లల కళ్ళలో నీళ్ళు రావు నిప్పులు కురుస్తాయని హెచ్చరించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి పోరాడవలసిన సమయం వచ్చేసిందని కనుక అందరం కలిసికట్టుగా పోరాడుదామని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలని మనం కాపాడుకొంటే అవే మనల్ని కాపాడుతాయని కల్వకుంట్ల కవిత అన్నారు. దేశంలో అరాచక పరిస్థితులపై ధీటుగా స్పందించాల్సిన మేధావులు, కళాకారులు, సాహిత్యకారులు నిరాశానిస్పృహలకి లోనయ్యి మౌనం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ జాగృతి కూడా జాతీయస్థాయికి మారాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఇకపై భారత్ జాగృతి పేరుతో ఇతర రాష్ట్రాలలో మన కార్యకాలాపాలు విస్తరిద్దామని కల్వకుంట్ల కవిత అన్నారు. ఆయా రాష్ట్రాలలో మహిళలు, విద్యార్దులు, కళాకారులు, మేధావులని జాగృతం చేస్తూ కలుపుకు ముందుకు సాగుదామని కల్వకుంట్ల కవిత అన్నారు.
భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చెపుతున్న కల్వకుంట్ల కవిత తెలంగాణలో బిఆర్ఎస్ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉందా?ఉండి ఉంటే కాంగ్రెస్, టిడిపిల నేతలు, ఎమ్మెల్యేలను చేర్చుకొని వాటిని ఎందుకు నిర్వీర్యం చేసింది?తెలంగాణ ఉద్యమాలలో తనతో భుజం భుజం కలిపి ముందుండి పోరాడిన ప్రొఫెసర్ కోదండరామ్‌ని కేసీఆర్ ఏవిదంగా సైడ్ చేసి అవమానించారో అందరికీ తెలుసు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసమో లేదా తమ మనుగడ కోసమో ప్రభుత్వానికి నిరసనలు తెలుపడానికి పాదయాత్రలు, ర్యాలీలు పెట్టుకొంటే అనుమతించడం లేదు.
వైఎస్ షర్మిల పాదయాత్రపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులు దాడి, ఆమె పాదయాత్రకి హైకోర్టు అనుమతించినా పోలీసులు అనుమతించకపోవడం ప్రజాస్వామ్యమా? వైఎస్ షర్మిల పాదయాత్ర చేయడం కోసం మళ్ళీ ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ వేసి అనుమతి పొందాల్సి వచ్చిందంటే అర్దం ఏమిటి?
ఈవిదంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బయలుదేరుతుండటం విడ్డూరమే కదా? ఐటి, ఈడీ, సీబీఐలని కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తున్న కల్వకుంట్ల కవితకి, రాష్ట్రంలో తన తండ్రి కూడా పోలీసులను, ఏసీబీని అదే విదంగా ప్రతిపక్షాల మీద ప్రయోగిస్తున్నారని తెలుసు కదా?
అసలు తెలంగాణలో బిజెపి అధికారం కోసం ప్రయత్నించకపోయుంటే, కేసీఆర్ కేంద్రంపై కత్తులు దూసేవారేకారు. ఎప్పటిలాగే కేంద్రంతో సఖ్యతగా ఉండేవారు. కానీ “నా బంగారు పుట్టలో వేలుపెడితే కుట్టనా?” అని చీమ అనుకొన్నట్లే తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని బిజెపి అనుకొన్నప్పటి నుంచే ఈ సమస్య మొదలైందని అందరికీ తెలుసు. అంటే సమస్య తమ వరకు వస్తే అది ప్రజల సమస్యగా, రాష్ట్ర సమస్యగా దేశ సమస్యగా మారిపోతుందన్న మాట!
కేసీఆర్ దేశాన్ని ఉద్దరించేందుకు అంటూ బిఆర్ఎస్‌తో తన ‘రక్షణ చట్రాన్ని’ విస్తరించుకోవాలనుకొంటున్నట్లే, కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతిని భారత్ జాగృతిగా విస్తరించి రక్షణ చట్రం ఏర్పాటు చేసుకోవాలని సూచించి ఉండవచ్చు. అందుకే సీబీఐ విచారణ జరిగిన మర్నాడే హడావుడిగా తెలంగాణ జాగృతి సమావేశం ఏర్పాటు చేసినట్లు భావించవచ్చు.



