తెలంగాణ రాజకీయాలలో నేను సైతం అంటూ జాగృతి జెండా తో కవిత కథం తొక్కుతున్నారు, బిఆర్ఎస్ పై రాజకీయ యుద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో మంచి ముహూర్తం చూసుకుని మరో మూడు నెలలలో తన సొంత రాజకీయ పార్టీ పేరుని ప్రకటిస్తానంటూ కల్వకుంట్ల కుటుంబానికి ఒక రాజకీయ హెచ్చరిక పంపారు కవిత.
నాకు సెంటిమెంట్స్ కాస్త ఎక్కువ, అందుకే ఏదైనా పని ప్రారంభించే ముందు శకునాలు, ముహుర్తాలు చూసుకుని ఆ పనిని మొదలుపెడతాను అంటూ చెప్పుకొచ్చిన కవిత ఆ మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నా అంటూ ప్రకటించారు.
అయితే తెలంగాణ రాజకీయాలలో కవిత కొత్త పార్టీ కి అవసరమైన గ్యాప్ ఉందా.? ఇప్పటికే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ నువ్వా – నేనా అంటూ తలపడుతుంటే, మధ్యలో బీజేపీ నేను కూడా ఉన్నాను అంటూ ఉనికి కోసం పోరాడుతున్న సమయంలో కవిత కొత్త పార్టీ కి ఛాన్స్ ఉంటుందా.? తెలంగాణ ప్రజలు ఇస్తారా.? అన్నది చర్చనీయాంశం.
అయితే తనకు, తన పార్టీకి తెలంగాణ రాజకీయాలలో ఛాన్స్ ఉంటుందా అని మీనా మేషాలు లెక్కించకుండా కవిత ఆ ఛాన్స్ తానే పోరాడి సంపాధించుకుంటా, అందుకు ఒక మంచి ముహూర్తం ఉంటే చాలు అనే నమ్మకంలో ఉన్నారు. ఆమె ఈ నమ్మకం తానూ, తన పార్టీ బలపడడానికా లేదా బిఆర్ఎస్ ను బలహీనపరచడానికా.? అన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం.
గతంలో ఏపీలో కాంగ్రెస్ తో చేరి షర్మిల మొదలుపెట్టిన రాజకీయం కూడా తన బలోపేతానికి కాకుండా వైసీపీ బలహీనతకు తోడ్పడింది. వైసీపీ పై షర్మిల చేసిన ఆరోపణలు, జగన్ పై ఆమె ఎక్కుపెట్టిన విమర్శనాబాణాలు వైసీపీ 151 నుంచి 11 కి పతనమవడానికి దోహదపడ్డాయి.
ఇప్పుడు కూడా అదేమాదిరి తెలంగాణలో బిఆర్ఎస్ పై కవిత చేస్తున్న విమర్శలు, ఆ పార్టీ ముఖ్య నేతల టార్గెట్ గా కవిత సంధిస్తున్న ఆరోపణలు బిఆర్ఎస్ ని ఇరుకున పెడుతున్నాయి. కక్కలేక, మింగలేక అన్నట్టుగా బిఆర్ఎస్ లీడర్లు కవిత పై ఎదురుదాడి చెయ్యలేక, ఆమె తమ పై గురి పెడుతున్న బాణాలను తప్పించుకోలేక సతమతమవుతున్నారు.
ఇటువంటి సందర్భంలో కవిత కొత్త పార్టీతో బిఆర్ఎస్ పై విరుచుకుపడితే ఆ కవిత ముహూర్త బలం తమ పతనానికి వచ్చినట్టే అన్న భావనలో బిఆర్ఎస్ శ్రేణులు మునిగిపోయే అవకాశం ఉంటుంది. మరి తండ్రి కేసీఆర్ మాదిరే కవిత కూడా తన బలంకు దైవ బలం కూడా అవసరమని, యాగాలు, యజ్ఞాలు చేసి మరి మంచి ముహూర్తం చూసుకుని తన ప్రత్యర్థి పై రాజకీయ ఎటాక్ కు సిద్దమవుతారన్నమాట..!






