నేడు కవిత తెలంగాణ రాజకీయాలలోకి ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరుతో మరోకొత్త రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అయితే కవిత తన కొత్త రాజకీయ పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటించడం కోసం ఏర్పాటు చేసిన సభలో ఆమె చేసిన ప్రసంగం అందరిని ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి.
చేతిలో స్క్రిప్ట్ పేపర్ లేకుండా, తానూ చెప్పదలచుకున్నది, తన పార్టీ చేయదలచుకున్నది స్పష్టంగా అటు తన ప్రత్యర్థి రాజకీయ పార్టీలతో పాటుగా ఇటు తెలంగాణ ప్రజలకు కూడా సూటిగా చెప్పగలిగారు. ఈ నేపథ్యంలో కవిత చేసిన స్క్రిప్ట్ లేని ప్రసంగాన్ని గమనించిన వారు సోషల్ మీడియాలో జగన్ పై ట్రోల్స్ చేస్తున్నారు.
వైసీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి మొదలు ఆ పార్టీలోని నేతలు ఎవరు మీడియా ముందుకొచ్చి ప్రజా సమస్యల పై గళం వినిపించినా, తమ పార్టీ విధివిధానాలు వివరించినా, చివరికి తమ రాజకీయ ప్రత్యర్థులైన బాబు, పవన్, లోకేష్ ల పై విమర్శలు కురిపించాలనుకున్నా వారి కళ్ళ ముందు స్క్రిప్ట్ పేపర్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ముఖ్యంగా జగన్ విషయంలో స్క్రిప్ట్ పేపర్ అత్యంత కీలకం.
జగన్ రాజకీయ అరంగేట్రం నుంచి ఇప్పటి వరకు తన పొలిటికల్ స్పీచ్ లను ఒక్కసారి గమనిస్తే, వైసీపీ సభలకు ఆ పార్టీ నేతల ప్రెస్ మీట్లకు స్క్రిప్ట్ ఎంత అవసరమో అనేది యిట్టె అర్ధమవుతుంది. కానీ కవిత తానూ చేసిన ప్రసంగం మొత్తం కూడా ఎటువంటి స్క్రిప్ట్ పేపర్ లేకుండా అనర్గళంగా చెప్పదలచుకున్న ‘పాంచజన్యం’ మొత్తాన్ని పూర్తిగా చెప్పగలిగారు.
దీనితో కవిత మాటకారి తనం, వాక్ చాతుర్యం మీద మరోసారి సర్వత్రా చర్చ జరుగుతుంది. తెలంగాణ యాసతో గతంలో కేసీఆర్ మాదిరి కవిత ప్రసంగం మొత్తం వీక్షకులను ఆకట్టుకునేలా సాగింది. అయితే ఈ వాక్ చాతుర్యం కవిత కొత్త రాజకీయ ప్రయాణానానికి ఏ మేరకు ఎయిర్ బాగ్స్ మాదిరి కాపాడుతాయో అనేది వేచి చూడాల్సిందే.




