తెలంగాణ రాజకీయాలలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించడానికి రానున్న మే నెల వేదిక కానుంది. కేసీఆర్ కుమార్తె గా తెలంగాణ రాజకీయాలలోకి అడుగుపెట్టిన కవిత ఊహించని రీతిలో బిఆర్ఎస్ కు దూరమయ్యారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం జాగృతి పేరుతో తెలంగాణలో సొంత రాజకీయం నడుపుతున్న కవిత ఒక మంచి ముహూర్తం చూసుకుని ఈ మే నెలలో కొత్త పార్టీ పేరుని ప్రకటిస్తానని, ఆ పేరులో ‘తెలంగాణ’ అనే పదం ఉంటుందంటూ తన కొత్త పార్టీ సమాచారాన్ని క్లుప్తంగా చెప్పారు.
అలాగే ఆ కొత్త పార్టీతో తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని కూడా సిద్ధిపేట నుంచి కానీ బోధన్ నుంచి కానీ మొదలుపెడతానంటూ కవిత హింట్ ఇచ్చారు. అయితే కవిత బిఆర్ఎస్ కి దూరం కావడానికి కొన్ని నెలల ముందు నుంచి ఇప్పటి వరకు హరీష్ టార్గెట్ గానే బిఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తున్నారు.
బిఆర్ఎస్ కోవర్డ్ అంటూ కొన్నాళ్ళు, కేసీఆర్ కి కట్టప్ప అంటూ మరి కొన్నాళ్లు, గుంటనక్క అంటూ ఇంకొన్నాళ్ళు ఇలా హరీష్ కేంద్రంగా కవిత తన కొత్త రాజకీయ ప్రాయాణానికి బాటలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కవిత చేసిన ప్రకటన కూడా హరీష్ నే గురి పెట్టినట్టు స్పష్టంగా అర్ధమవుతుంది.
కవిత తానూ పోటీ చెయ్యబోయే స్థానంలో సిద్దిపేటకు తన మొదటి ప్రాధాన్యత అంటూ ప్రకటించడం అంటే హరీష్ ముందు కుప్పిగంతులే అన్నట్టు. సిద్ధిపేట హరీష్ రావు కంచుకోట. 2004 నుంచి సిద్ధిపేట నియోజకవర్గంలో హరీష్ ఏకచరాధిపత్యం సాగిస్తున్నారు. ఇప్పటికి ఆయనకు సిద్దిపేటకు మధ్య 22 ఏళ్ళ బలమైన రాజకీయ బంధం కొనసాగుతుంది.
అలాగే నాటి నుంచి నేటి వరకు సిద్ధిపేట ప్రజలు హరీష్ కి తిరుగులేని మెజారిటీని కట్టబెడుతూ సిద్ధిపేట హరీష్ అడ్డా అనేలా హరీష్ వైపు బలంగా నిలబడుతున్నారు, ప్రత్యర్థులను కనీసం పోటీలో కూడా లేకుండా ఓడిస్తున్నారు. అటువంటి రాజకీయ బలం ఉన్న స్థానం నుంచి హరీష్ ను సవాల్ చెయ్యడం అంటే హనుమంతుని ముందు కుప్పిగంతులు వేయడమే అవుతుంది.
2004 ఎన్నికలలో సుమారు 24 వేల ఓట్ల మెజారిటీ దక్కించుకున్న హరీష్ ఇక అక్కడి నుంచి అంచలంచెలుగా తన మెజారిటీని పెంచుకుంటూ 2018 లో ఏకంగా 1,20,000 ఓట్ల తేడాతో ప్రత్యర్థి పై ఎవరు ఊహించని ఘన విజయం సాధించారు. తాజాగా జరిగిన 2023 ఎన్నికలలో సైతం సిద్దిపేటలో హరీష్ సుమారు 80 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీ దక్కించుకున్నారు.
ఇలా సిద్దిపేటలో ఈ రకమైన ట్రాక్ రికార్డు కొనసాగిస్తున్న హరీష్ ని టార్గెట్ చేస్తూ సిద్ధిపేట నుంచి తన పోటీ ఉంటుందంటూ కవిత చేసిన ప్రకటన హాస్యాస్పదమే అంటున్నారు రాజకీయాయ్ విశ్లేషకులు.




