తెలంగాణ సిఎం కేసీఆర్ హైదరాబాద్‌లో, ఢిల్లీలో బిఆర్ఎస్ పార్టీ ఆవిష్కరణ హడావుడి తర్వాత మళ్ళీ అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అంటే వేరే అంశంపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికే అప్పుడప్పుడు ఇలా హడావుడి చేస్తుంటారా?అనే సందేహం కలుగక మానదు.
ఢిల్లీలో కేసీఆర్ బిఆర్ఎస్ జెండా ఎగురవేయగానే వివిద రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు పార్టీలో చిరిపోవడానికి క్యూ కట్టి ఎదురుచూస్తున్నారంటూ బిఆర్ఎస్ నేతలు మీడియాకి లీకులు ఇచ్చారు కానీ పార్టీ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా ఎవరూ రాలేదు! కేసీఆర్ ఢిల్లీలో జాతీయ మీడియాతో సమావేశం నిర్వహించి తన ఆశయాలు, కార్యాచారణ గురించి మాట్లాడుతారని అందరూ అనుకొన్నారు కానీ ఆయన ఏమీ మాట్లాడకుండానే హైదరాబాద్ తిరిగివచ్చేశారు.
అప్పటి నుంచే బిఆర్ఎస్ పార్టీలో అందరూ మళ్ళీ ‘సైలెంట్ మోడ్’లోకి వెళ్లిపోయారు. అంటే కేసీఆర్ ఢిల్లీలో ఉండగా ఏమైనా జరిగిందా లేక ప్రళయం ముందు నిశబ్దంలాగ కేసీఆర్ మరేదో పెద్ద హడావుడి చేయడానికి సిద్దం అవుతున్నారా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బిజెపి, బిఆర్ఎస్‌ల మాటల యుద్దంతో ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉండే తెలంగాణ రాజకీయాలు కూడా వాతావరణంతో పాటు కాస్త చల్లబడ్డాయి.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో బిఆర్ఎస్ బహిరంగసభ నిర్వహించబోతోందని, రాష్ట్రానికి చెందిన కొందరు ప్రముఖులతో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంప్రదింపులు జరుపుతున్నట్లు మీడియా లీకులు వచ్చాయి కానీ మళ్ళీ ఎటువంటి కొత్త లీకులు రాలేదు. ఏపీ మంత్రులు కూడా కేసీఆర్, బిఆర్ఎస్ ఊసేత్తకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ టాపిక్‌తో కంటిన్యూ అయిపోతున్నారు.
ఇవాళ్ళ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌తో వర్తమాన రాజకీయాలపై చర్చిస్తారనే ఓ వార్త వచ్చింది. వర్తమాన రాజకీయాల గురించి కేసీఆర్ ఎంతమందితో ఎంత కాలం చర్చించినా అదేమీ గొప్ప విషయం కాబోదు. కేవలం బిఆర్ఎస్ కార్యాచరణ మాత్రమే ముఖ్యం. అదే లేదు.
కనుక కేసీఆర్ ఢిల్లీలో ఉన్నప్పుడు తన కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకి సంబందించి బిజెపి పెద్దలతో ఏమైనా రాయబారం నడిపారా? వారి నుంచి ఏదైనా హామీ రావడం వలననే బిఆర్ఎస్ నేతలందరినీ ‘సైలెంట్ మోడ్’లో పెట్టారా?లేక మరేదైనా భారీ ప్రణాళికని సిద్దం చేస్తున్నారా? అనేది రాబోయే రోజుల్లో ఆయన కార్యాచరణని బట్టి తెలుస్తుంది.



