ఇక తగ్గేదేలే… కేసీఆర్‌ కుటుంబమే టార్గెట్: వైఎస్ షర్మిల

KCR Family is Target YS Sharmilaవైఎస్ షర్మిల సుమారు ఏడాదిగా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నా రాని మీడియా కవరేజ్, గుర్తింపు వరంగల్‌ జిల్లాలో టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడంతో వచ్చింది. మరుసటి రోజు ఆమెను కారుతో సహా క్రేన్‌తో పోలీస్ స్టేషన్‌కి తరలించినప్పుడు యావత్ దేశం దృష్టిలో కూడా పడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ తనకు ఫోన్‌ చేసి ఈ ఘటనలపై సానుభూతి తెలిపారని ఆమె స్వయంగా ఈరోజు దృవీకరించారు. ఈరోజు అంబేడ్కర్ వర్దంతి సందర్భంగా హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత వైఎస్ షర్మిల మరోసారి కేసీఆర్‌ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ కుటుంబాన్ని నోటికి వచ్చినట్లు విమర్శిస్తే సహించబోమని టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు తీవ్రంగా హెచ్చరించినా ఆమె తగ్గేదేలే అన్నట్లు ఈరోజు మాట్లాడారు.

ఇంతకీ వైఎస్ షర్మిల ఏమన్నారంటే, “కేసీఆర్‌కి అంబేడ్కర్ అంటే గౌరవం లేదు అందుకే ఆయన వ్రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని అన్నారు. ఇది అంబేడ్కర్‌ని అవమానించడమే. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుని కమీషన్ల కోసమే రీడిజైనింగ్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చి లక్షల కోట్లు దోచుకొన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్‌ రావు ఒంటిపై పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె తెచ్చుకోవడం మరిచిపోయానని నాటకం ఆడి అమాయకులైన యువకులను రెచ్చగొట్టారు. అగ్గిపెట్టె తెచ్చుకొన్న శ్రీకాంతాచారి అమరుడైతే, అగ్గిపెట్టె మరిచిన హరీష్‌ రావు మంత్రి అయ్యారు.

ADVERTISEMENT

నిజానికి కేసీఆర్‌ కుటుంబంలో అందరికీ ఆస్కార్ అవార్డులు ఇవ్వాల్సిందే. కేసీఆర్‌ గడ్డాలు పెంచుకొని ఆమరణ దీక్ష నాటకం ఆడితే, ఆయన కొడుకు అందరికీ ఉద్యోగాలు ఇచ్చామని నాటకాలు ఆడుతున్నారు. కేసీఆర్‌ కుమార్తె బతుకమ్మ ఆడుతూ నిశబ్ధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్‌ కుటుంబం ఆస్తులు త్యాగాలు చేసిందా?ప్రాణాలు త్యాగాలు చేసిందా? అనేకమంది యువకులు బలిదానాలు చేసుకొంటే, కేసీఆర్‌ కుటుంబం మంత్రి పదవులు అనుభవిస్తూ లక్షల కోట్లు సంపాదించుకొంటున్నారు. వీరా నన్ను ప్రశ్నించేది?అడ్డుకోనేది.

తెలంగాణ ప్రజల కోసం నేను పాదయాత్ర చేస్తుంటే నాపై టిఆర్ఎస్‌ గూండాలు దాడి చేసినప్పుడు అనేకమంది ఫోన్లు చేసి నాకు సంఘీభావం, సానుభూతి తెలిపారు. అందుకు ప్రధాని నరేంద్రమోడీతో సహా అందరికీ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. టిఆర్ఎస్‌ నేతల బెదిరింపులకి భయపడేదానినే అయితే నేను అసలు పార్టీ పెట్టేదానిని కాదు పాదయాత్ర చేసేదానిని కాదు. కానీ టిఆర్ఎస్‌ నేతల బెదిరింపులకి నేను భయపడే ప్రసక్తే లేదు,” అని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories