ఢిల్లీలో జెండా ఎగరేశారు… అసలు కధ మొదలయ్యేది ఇప్పుడేగదా?

KCR BRS Partyతెలంగాణ సిఎం కేసీఆర్‌ నేడు ఢిల్లీలో బిఆర్ఎస్‌ పార్టీ జెండా ఎగురవేసి జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించారు. ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి ఆయన అనుంగు మిత్రులు కర్ణాటక నుంచి కుమారస్వామి, యూపీ నుంచి అఖిలేశ్ యాదవ్, రైతు సంఘాల నేతలు హాజరయ్యారు. వారితోపాటు తెలంగాణ నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

బిఆర్ఎస్‌ జాతీయ అధ్యక్షుడిగా జెండా ఎగురవేసిన తర్వాత ఆయన పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా హర్యానాకి చెందిన జాతీయ రైతు సంఘం నాయకుడు గుర్నామ్ సింగ్‌ని, పార్టీ కార్యాలయ కార్యదర్శిగా రవి కొహార్‌ని నియమిస్తున్నట్లు ప్రకటించారు.

ADVERTISEMENT

ఈరోజు వివిద రాష్ట్రాలకి చెందిన పలువురు రాజకీయ నాయకులు బిఆర్ఎస్‌ పార్టీలో చేరుతారని మీడియాలో వార్తలు వచ్చాయి కానీ ఎవరూ చేరలేదు. కేసీఆర్‌తో టచ్చులో ఉన్నారని చెప్పుకొన్న బిహార్‌, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు నితీశ్ కుమార్‌, మమతా బెనర్జీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. తెలంగాణలో కలిసి పనిచేసిన వామపక్షాల నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. బిఆర్ఎస్‌ ఆవిర్భావం పట్ల వారెవరూ ఎటువంటి ప్రకటన చేయలేదు కూడా.

అయితే అంతమాత్రన్న బిఆర్ఎస్‌కి వారందరూ వ్యతిరేకిస్తున్నారనో లేదా అనుకూలంగా ఉన్నారనో ఇప్పుడే అంచనా వేయడం సరికాదు. ఇకపై కేసీఆర్‌ కార్యాచరణ ఏవిదంగా ఉండబోతోందనే దానిపైనే ఉత్తరాది రాష్ట్రాల నేతలు స్పందించవచ్చు. ముఖ్యంగా కేసీఆర్‌ కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టాలనుకోవడం ఉత్తరాది పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. వాటిలో చాలా పార్టీలు కాంగ్రెస్ పార్టీతోనే కలిసి సాగుతున్నాయి. కనుక వాటి సహాయసహకారాలు కావాలనుకొంటే కేసీఆర్‌ దీనిపై పునరాలోచన చేయాల్సి ఉంటుంది.

అయితే 75 ఏళ్ల తర్వాత కూడా నేడు దేశం ఈ దుస్థితిలో ఉండటానికి బిజెపి, కాంగ్రెస్ పార్టీలే కారణమని వాటిని బంగాళాఖాతంలో కలిపేస్తేగాని దేశం బాగుపడదని కేసీఆర్‌ పలుసార్లు చెప్పారు. పైగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదీగాక కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేయడానికి కేసీఆర్‌ సిద్దపడితే, ప్రధాన మంత్రి కావాలనే ఆయన కోరిక నెరవేరదు. ఎందుకంటే కాంగ్రెస్‌తో దోస్తీ అంటే రాహుల్ గాంధీని ప్రధానిగా అంగీకరించాల్సి ఉంటుంది. కేసీఆర్‌ ప్రధానమంత్రి అయితే తప్ప ఆయన చెప్పుకొంటున్న “గుణాత్మకమైన మార్పులు” చేయలేరు. కనుక కాంగ్రెస్‌ లేకుండానే ముందుకు సాగకతప్పదు. అప్పుడు బిఆర్ఎస్‌ ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో దోస్తీ కుదరకపోగా వాటితో కూడా ఎన్నికలో పోటీ పడాల్సి ఉంటుంది.

ఇక దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటకలో కుమారస్వామితో దోస్తీ చేసి ఎన్నికలలో పోటీ చేయవచ్చు కానీ తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో అది సాధ్యం కాదు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఆయన టిడిపిని వ్యతిరేకిస్తారు. ఆయనతో జగన్‌ చేతులు కలిపితే కేంద్రానికి కోపం వస్తుంది. జనసేన బిజెపితో ఉంది. ఇక మిగిలింది వామపక్షాలు మాత్రమే. కనుకనే ఏపీలో బిఆర్ఎస్‌ కూడా కులాల ఆధారంగానే రాజకీయాలు చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

కనుక కేసీఆర్‌ ముందు అతి క్లిష్టమైన ముళ్ళబాట ఉంది. దానిని తనకు అనుకూలంగా మలుచుకొని ఏవిదంగా ముందుకు సాగుతారో రాబోయే ఎన్నికలోగా స్పష్టం అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories