జగిత్యాల సభ: కేసీఆర్‌కి లాస్ట్ ఛాన్స్?

KCR Jagtial Meeting: Big Test for BRS Comeback

ఈరోజు సాయంత్రం జగిత్యాలలో బీఆర్ఎస్‌ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. దాదాపు రెండున్నరేళ్ళుగా ఫామ్‌హౌసులో రాజకీయ అజ్ఞాతవాసం చేస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌, నేడు ఈ సభతో మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్నారు.

కనుక ఆయనకు, ఈ సభకు బీఆర్ఎస్‌ పార్టీ బాగానే హైప్ క్రియేట్ చేస్తోంది. అట్టహాసంగా సభకు ఏర్పాట్లు, భారీగా జనసమీకరణ చేసి ఈ సభని విజయవంతం చేసేందుకు పార్టీలో అందరూ చాలా శ్రమిస్తున్నారు.

ADVERTISEMENT

పెద్ద సినిమాలకు అందరూ కలిసి హైప్ క్రియేట్ చేస్తుంటారు. అది చాలా అవసరం కూడా. అలా హైప్ క్రియేట్ చేస్తున్న కొద్దీ దానిపై అంచనాలు పెరిగిపోతుంటాయి. కనుక సినిమా ఓపెనింగ్స్ భారీగా ఉంటాయి.

సినిమా బాగుంటే ఇక తిరుగు ఉండదు. అప్పటికే చాలా హైప్ క్రియేట్ చేయడం వలన మరింత వేగంగా దూసుకుపోతుంది. కానీ ఇంత హైప్ క్రియేట్ చేసిన తర్వాత ఏమాత్రం అంచనాలకు తక్కువగా ఉన్న వెంటనే బోర్ల పడుతుంది.

అప్పుడు ఇంత హైప్ క్రియేట్ చేయడమే ఆ సినిమాకు శాపంగా కూడా మారుతుంది. వెంటనే నెగెటివ్ టాక్ మొదలై ఆ సినిమాని తెరుకోనీయకుండా చంపేస్తుంది.

జగిత్యాల సభ.. దానికి కేసీఆర్‌ హాజరు విషయంలో కూడా బీఆర్ఎస్‌ పార్టీ ఇలాగే చాలా హైప్ క్రియేట్ చేసింది. దీంతో కాంగ్రెస్‌ పతనం, బీఆర్ఎస్‌ పార్టీ జైత్రయాత్ర మొదలవుతుందంటూ గొప్పగా చెప్పుకుంటోంది.

కేసీఆర్‌ని చూసి సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ మంత్రులకు భయం పుట్టిందని, అందరూ గజగజ వణికిపోతున్నారని బీఆర్ఎస్‌ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇలాగే ప్రచారం చేస్తోంది.

కనుక నేటి సభలో కేసీఆర్‌ నిజంగానే సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ మంత్రులు భయంతో గజగజ వణికిపోయేలా చేస్తారా? డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో మళ్ళీ ప్రధాని మోడీపై విరుచుకుపడతారా?

కూతురు కవిత పితృ ద్రోహి, పార్టీ ద్రోహి, తెలంగాణ ద్రోహి అంటూ ఆమె పార్టీ ఏర్పాటు చేయకముందే తెలంగాణలో ఏకాకిగా చేస్తారా? లేదా ఆమెని, ఆ పార్టీని మనం పట్టించుకోనవసరం లేదని సర్ది చెపుతారా?

ఇలాంటి అన్ని అంశాలపై కేసీఆర్‌ మునుపటిలా ధైర్యంగా, అహంకారంతో స్పష్టంగా మాట్లాడితేనే బీఆర్ఎస్‌ పార్టీ శ్రేణులకు ఆయనపై, పార్టీపై నమ్మకం ఏర్పడుతుంది. కేసీఆర్‌లో మునుపటి ‘ఫైర్’ ఇంకా అలాగే ఉందని నిరూపించుకోగలిగితేనే ప్రజలకు కూడా ఆయనపై నమ్మకం ఏర్పడుతుంది.

కానీ ఈ సభలో కాసేపు సిఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తిట్టిపోసి, కాసేపు సొంత డబ్బా కొట్టుకొని మళ్ళీ ఫామ్‌హౌసులోకి వెళ్ళిపోతే, ఈ సభ నుంచే బీఆర్ఎస్‌ పార్టీ పతనం ప్రారంభం కావచ్చు.

కనుక ఈ జగిత్యాల సభ కేసీఆర్‌కి, బీఆర్ఎస్‌ పార్టీకి చివరి అవకాశమనే భావించవచ్చు. కేసీఆర్‌ దీనిని సద్వినియోగం చేసుకుంటారా లేక బాగా హైప్ క్రియేట్ చేసిన సినిమా బోర్లా పడితే అభిమానులు ఉసూరుమన్నట్లు, కేసీఆర్‌ కూడా పార్టీ శ్రేణులను ఉసూరుమనిపించి మళ్ళీ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతారా?ఈరోజు సాయంత్రం తెలుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories