గత పదేళ్ల బిఆర్ఎస్ అధికారంతో ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఐటీ మంత్రిగా కేటీఆర్, నీటి పారుదల, ఆర్థిక మంత్రిగా హరీష్ రావు, ఎంపీ గా, ఎమ్మెల్సీ గా కవిత ఈ నలుగురు కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా తెలంగాణ రాజకీయాలలో చక్రం తిప్పారు.
అయితే నాడు తెలంగాణ రాజకీయాలను శాసిస్తూ, ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తూ జాతీయ రాజకీయాలలో అడుగుపెట్టాలని భావించిన కేసీఆర్, అందుకు తగ్గట్టే తన పార్టీ పేరును తెరాస నుంచి బిఆర్ఎస్ గా మార్పు చేసారు.
అయితే తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్టుగా, ప్రజలు వేరొక తీర్పు తో కేసీఆర్ కారును షెడ్ కి పంపారు. ఇక నాడు తెలంగాణలో హ్యాట్రిక్ విజయం అందుకుని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ఢిల్లీ రాజకీయాలలో చక్రం తిప్పాలి అని కలలు కన్న కేసీఆర్ కు కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం రూపంలో మరొక విధంగా కేసీఆర్ ను ఢిల్లీ రాజకీయాలకు పరిచయం చేసి కేసీఆర్ ను గల్లిలో తలెత్తుకోలేకుండా చేసింది.
ఇలా కేసీఆర్ కుటుంబం నుంచి కవిత తొలిసారిగా ఒక లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కొంటు ఆరు మాసాలు ఖైదీగా తీహార్ జైల్లో జీవితం గడిపారు. ఇక ఆ తరువాత వరుసలో కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఫోన్ టాపింగ్, ఫార్ములా ఈ కేసులను నెత్తినేసుకుని విచారణకు హాజరవుతున్నారు.
తాజాగా ఈ కేసులో ఏసీబీ నుంచి మరోసారి నోటీసులు అందుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్. అయితే ఒక బాధ్యత గల పౌరుడిగా కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని, ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఏసీబీ విచారణ ఎదురుకుంటున్నారు కాబట్టి ఇద్దరు న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట లై డిటెక్టర్ టెస్ట్ చేయించుకుని, దాన్ని లైవ్ టెలికాస్ట్ చేద్దాం అంటూ రేవంత్ సర్కార్ కు సోషల్ మీడియా వేదికగా ఓపెన్ ఛాలెంజ్ విసిరారు కేటీఆర్.
ఇక ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అధినేత, కుటుంబ పెద్ద కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి పై విచారణను ఎదురుకుంటున్నారు. అలాగే కేసీఆర్ కుడి భుజం, బిఆర్ఎస్ ముఖ్య నాయకుడు హరీష్ రావు కూడా కేసీఆర్ బాటలోనే కాళేశ్వరం పై విచారణకు హాజరవ్వాలంటూ అధికారుల నుండి నోటీసులు అందుకున్నారు.
నాడు తెలంగాణ రాజకీయాలను, ప్రత్యర్థి పార్టీల నాయకులను తమ కనుసన్నలలో ఆడించిన ఈ కేసీఆర్ కుటుంబసభ్యులు ఇప్పుడు కేసుల భారాన్ని మోస్తూ, కుటుంబ విభేదాలను ఎదుర్కొంటు, బిఆర్ఎస్ పార్టీ చీలిక దిశగా అడుగులేస్తున్నారు.
నాడు ప్రత్యర్థి పార్టీల నేతలతో ‘కుటుంబ పాలన’ అంటూ ఆరోపణలు ఎదుర్కున్న బిఆర్ఎస్ నేడు కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ కేసు, కేటీఆర్ ఫోన్ టాపింగ్, ఫార్ములా ఈ కేసులు, కేసీఆర్, హరీష్ కాళేశ్వరం విచారణలతో ‘కుటుంబ అవినీతి’ అంటూ అదే ప్రత్యర్థి పార్టీల నాయకులకు టార్గెట్ అయ్యారు.




