kisika-bhai-kisiki-jaanఒక్కోసారి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో దొరికేసరికి కొందరు దర్శకులు బేసిక్ కామన్ సెన్స్ మర్చిపోతారు. ఏదో ఒకటి దొరికిన కథను కమర్షియల్ గా తీసేస్తే వందల కోట్లు వచ్చి పడతాయనే భ్రమలో ఉంటారు. సల్మాన్ ఖాన్ లేటెస్ట్ కళాఖండం కిసీకా భాయ్ కిసీకా జాన్ చూశాక ఇదే అనుమానం కలుగుతుంది. దర్శకుడు ఫర్హద్ సంజీ టాలెంట్ ఉన్నోడే. మరి ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన అజిత్ వీరంని చూసినప్పుడే ఇలాంటి కథ వర్కౌట్ కాదని ఎందుకు గుర్తించలేకపోయాడో. సల్మాన్ కి అంత జడ్జ్ మెంట్ ఉంటే రేస్ 3, రాధేలు వచ్చేవి కాదుగా.

పోష్ గా ఉండే ఒక బస్తీలో పేరు లేని కండల వీరుడిని అందరూ భాయ్ జాన్(సల్మాన్ ఖాన్) అని పిలుస్తుంటారు. పెళ్లి కాని ముగ్గురు తమ్ముళ్ళు అన్నయ్యకు మూడు ముళ్ళు వేయించడం కోసం భాగ్యలక్ష్మి(పూజా హెగ్డే)ని సెట్ చేసి పెడతారు. ఆమె ఫ్యామిలీని బుట్టలో వేసుకోవడం కోసం మొత్తం హైదరాబాద్ వెళ్ళిపోతారు. భాగ్య అన్నయ్య బాలకృష్ణ(వెంకటేష్)కు హింస అంటే పడదు. రౌడీ లక్షణాలున్న భాయ్ జాన్ అవన్నీ దాచేసి బుద్దిమంతుడిలా వస్తాడు. కానీ బావగారి శత్రువు నాగేశ్వర్(జగపతిబాబు)వల్ల తనలో వయొలెంట్ యాంగిల్ ని బయటికి తీయాల్సి వస్తుంది. అప్పుడు జరిగే భీకర యుద్ధంలో గెలుపెవరిదో ఈజీగా ఊహించేదే

Also Read – ఎవరిని నిందించాలి..?

సినిమా చూశాక ఇద్దరి మీద అయ్యో పాపం అనిపిస్తుంది. మొదటి వ్యక్తి విక్టరీ వెంకటేష్. సాత్వికం, భయానకం రెండు రసాలను అద్భుతంగా పండించగల ఇలాంటి నటుడిని ఫర్హద్ కనీస స్థాయిలో వాడుకోలేకపోయాడు. ఒకదశలో పాపం వెంకీనే ఎలాంటి ఎక్స్ ప్రెషన్లు ఇవ్వాలో అర్థం కాక రాజా, లక్ష్మిలను గుర్తుచేసుకుని లాగించేశారు. ఇక రెండో మనిషి పూజా హెగ్డే. ఇక్కడ సీనియర్ హీరోలు అడిగితే నో అంటుందేమో కానీ ఇంచుమించు అంతే వయసున్న సల్మాన్ ఖాన్ తో మాత్రం బాలీవుడ్ మోజులో ఎస్ చెప్పినందుకు గొప్ప పాత్రే దక్కింది. దీనివల్ల అమ్మడి వయసు పెరిగిందనుకోవాలో లేదా సల్లు భాయ్ యంగ్ అని సరిపెట్టుకోవాలో అర్థం కాదు

వీరం కాటమరాయుడులను కలిపి ఒక చొక్కాగా కుట్టి దానికి పోకిరి బటన్లు, వినయ విధేయ రామా దారాలు, లక్ష్మి లేబుళ్ళు పెట్టినంత మాత్రాన మాస్ మసాలా అయిపోదు. అసలు సల్మాన్ ఖాన్ పరిచయ సన్నివేశం చూడగానే బయటికి వెళ్లిపోదామనిపించేంత గొప్పగా తీర్చిద్దిదాడు ఫర్హద్ సంజీ. అక్కడితో మొదలు చివరి దాకా ఇదే తంతు. వెంకీ కోసం సెకండ్ హాఫ్ ని కొంతైనా భరించవచ్చనిపిస్తుంది కానీ ఒకదశ దాటాక బయటకు వెళ్లేందుకు ఆశగా తలుపు వైపు మనసు లాగడం ఖాయం. సాధారణంగా ఇలాంటి కంటెంట్ ని వర్ణించేందుకు ఇంగ్లీష్ లో క్రిన్జ్ అనే పదం వాడతారు. ఇలాంటి భాయ్ జాన్ లు చూశాక ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ కొత్త నిర్వచనం వెతకాల్సిందే

Also Read – ఇంతకీ ఆ కేసులో కేసీఆర్‌ ఓడారా… గెలిచారా?