తాజా మాజీ మంత్రి కొడాలి నాని గత కొని రోజులుగా ఎందుకో మీడియా ముందుకు రావడం మానుకొన్నారు. అన్ని వ్యవహారాలపై సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులే మాట్లాడుతుండటంతో పార్టీలో ఆయనను సైడ్ చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బహుశః అందుకేనేమో మళ్ళీ నిన్న మీడియా ముందుకు వచ్చి వైసీపీ అభిమాన శత్రువులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లపై విమర్శలు గుప్పించారు.
బుదవారం కృష్ణాజిల్లా గుడివాడ మండలంలో లింగవరంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “అసలు రాజకీయ అవగాహన లేని సన్నాసి పవన్ కళ్యాణ్. అందుకే “కడప జిల్లాకు డా.అంబేడ్కర్ పేరు పెట్టుకోవచ్చు కదా?” అని పిచ్చి వాగుడు వాగారు. అసలు డా.అంబేడ్కర్‌ను వ్యతిరేకించే వారందరినీ దేశ బహిష్కరణ చేయాలి.
పవన్ కళ్యాణే చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతుంటారు. మళ్ళీ ఆయన నిక్కర్లు వేసుకొనే పిల్లలను రెచ్చగొడుతూ తానేదో గొప్ప రాజకీయ నాయకుడిలా బిల్డప్ ఇస్తుంటారు. టిడిపి, జనసేన వంటి చీకటి ఒప్పందాలు చేసుకొనే పార్టీల నేతల నుంచి తల్లితండ్రులు తమ పిల్లలను దూరంగా ఉంచి కాపాడుకోవాలి. లేకుంటే అనవసరంగా వారి భవిష్యత్ పాడవుతుంది,” అని కొడాలి నాని సూచించారు.
పవన్ కళ్యాణ్‌కు రాజకీయ అవగాహన కాస్త తక్కువ కావచ్చు కానీ అవినీతిపరుడు కాడు. కొడాలి నాని సభ ఎడితే జనసమీకరణ చేయాల్సి ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ ఫలానా రోజున, ఫలానా సభ అని చెపితే చాలు వేలాదిమంది అభిమానులు, జనసేన కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివస్తుంటారు.
కానీ వారందరికీ కూడా తమ అధినేత పవన్ కళ్యాణ్‌లాగే ఎటువంటి రాజకీయ అవగాహన లేదన్నట్లు కొడాలి నాని మాట్లాడటం వారి విజ్ఞతను అవమానించడమే. వారికి రాజకీయ చైతన్యం ఉంది కనుకనే పవన్ కళ్యాణ్ సభలకు హాజరవుతున్నారనే విషయం కొడాలి నానే గ్రహించినట్లు లేదు.



