సినిమా రిలీజ్ ముందు దర్శకుడు, హీరోహీరోయిన్లు మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నట్లే ఎన్నికలకు ముందు రాజకీయ నేతలు కూడా ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. తెలంగాణలో ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక అన్ని పార్టీల నేతలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. టీవీ ఛానల్స్ నిర్వహించే చర్చా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
మంత్రి తెలంగాణ ఐటి పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కూడా ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలోని పరిశ్రమలు తెలంగాణకు తరలివస్తుందతంపై అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఏమన్నారంటే, “ఇదివరకు వరంగల్లో ఓ ఐటి కంపెనీ ప్రారంభోత్సవానికి హాజరైనప్పుడు, వీలైతే ఏపీలో కూడా ఐటి కంపెనీలు ఏర్పాటుచేయమని కోరాను. అవసరమైతే నేనే సిఎం జగన్‌తో మాట్లాడి స్థలం ఇప్పిస్తానని చెప్పాను. ఎందుకంటే తెలంగాణ ఒక్కటే అభివృద్ధి చెందితే సరిపోదు. దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే భారత్ అభివృద్ధి చెందుతుంది.
ఏపీ నుంచి వివిద కారణాల చేత బయటకు వెళ్ళిపోతున్న పరిశ్రమలను చూస్తూ ఊరుకొంటే అవి వేరే ఏ రాష్ట్రానికో వెళ్ళిపోతాయి. అంతకంటే పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రానికి తెచ్చుకొంటే అందరికీ మంచిదే కదా?” అని అన్నారు.
“అమర్ రాజా బ్యాటరీస్ విషయానికి వస్తే, గల్లా జయదేవ్ తెలుగువారు. ఆయనకు ఇక్కడ హైదరాబాద్ ఇళ్ళు, కార్యాలయాలు ఉన్నాయి. ఆయన కుటుంబం కూడా ఇక్కడే ఉంది. కనుక ఆయన ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయడం సబబే అని భావిస్తున్నాను.
ఆంధ్రాకు చెందిన పలువురు మంత్రులు, వివిద పార్టీల నేతలు కూడా ఇక్కడే హైదరాబాద్‌లో ఉంటున్నారు. వారికి ఇక్కడా పరిశ్రమలు, వ్యాపారాలు ఉన్నాయి కదా?వారందరూ ఉండగా లేనిది అమర్ రాజా బ్యాటరీస్‌కు మాత్రమే ఎందుకు?తెలంగాణలో అన్ని దేశాలు, రాష్ట్రాలు పెట్టుబడులు పెట్టి, పరిశ్రమలు స్థాపిస్తున్నాయంటే చాలా సంతోషించవలసిన విషయమే కదా?” అని కేటీఆర్ అన్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్టుకి నిరసనగా హైటెక్ సిటీ వద్ద ఐటి ఉద్యోగులు నిరసనలు చేసినప్పుడు వారిని అనుమతించకపోవడంపై అడిగిన ప్రశ్నకు కేటీఆర్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. “మేమేమి చంద్రబాబు నాయుడుకి, టిడిపికి లేదా జగన్, వైసీపికి వ్యతిరేకం కాదు. కానీ ఆ రెండు పార్టీల మద్య గొడవలకు హైదరాబాద్ వేదిక కాకూడదనే హైదరాబాద్‌లో ఆందోళనలు వద్దని వారించాము,” అని కేటీఆర్ చెప్పారు.
ఇలా కేటీఆర్ వద్ద ప్రతీ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానాలు ఉన్నాయి. మరి ఆయన చెప్పిన ఈ విషయాలపై ఏపీ మంత్రులు వద్ద సమాధానాలు ఉన్నాయా?





