మరికొద్ది సేపటిలో ప్రకాశం జిల్లా మండువవారి పాలెంలో టిడిపి మహానాడు సభలు ప్రారంభం కాబోతున్నాయి. వివిద ఎన్నికలు, కరోనా కారణంగా గత నాలుగేళ్ళుగా ప్రత్యక్షంగా మహానాడు నిర్వహించలేకపోవడంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు సాగే మహానాడు సభలు చాలా అట్టహాసంగా, తెలుగుదేశం పార్టీ గొప్పదనం, సత్తా చాటిచెప్పేలా నిర్వహించబోతున్నారు.
ఈసారి మహానాడు నిర్వహణ, తీర్మానాలలో యువతకు ప్రాధాన్యం కల్పించడంతో యువనేతలు, వారి అనుచరులు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మహానాడు నిర్వహణకి వైసీపీ ప్రభుత్వం అడుగడుగున్నా అవరోధాలు సృష్టిస్తూ అడ్డుకొనేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సమరోత్సాహంతో ఉరకలు వేస్తున్న టిడిపి శ్రేణులు మహానాడుకి సకల ఏర్పాట్లు పూర్తి చేసారు.
నేడు తొలిరోజున మహానాడులో పార్టీ జాతీయధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉదయం 10.15 గంటలకు వేదికపై పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తరువాత టిడిపి జెండాను ఆవిష్కరిస్తారు. తరువాత ఫోటో ఎగ్జిబిషన్, రక్తదానం శిబిరాలను ప్రారంభిస్తారు.
సభా కార్యక్రమాలు ప్రారంభించే ముందు ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంతాపం ప్రకటిస్తారు. ఉదయం 11.45 గంటలకు చంద్రబాబు నాయుడు అధ్యక్షోపన్యాసం చేస్తారు. ఈసారి మహానాడులో 16 తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు. వాటిలో 12 తీర్మానాలు ఏపీకి, రెండు తెలంగాణ, ఒకటి అండమాన్ నికోబార్‌కు సంబందించినవి ఉన్నాయి. వాటిపై టిడిపి పొలిట్ బ్యూరో నిన్న సుదీర్ఘంగా చర్చించి ఆమోదించింది.
ఎన్నికలకి ఇంకా రెండేళ్ళ సమయం ఉండగానే వైసీపీ ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టడంతో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని టిడిపి భావిస్తోంది. కనుక చంద్రబాబు నాయుడు మహానాడులో పార్టీ శ్రేణులను ముందస్తు ఎన్నికలను ఎదుర్కొనేందుకు సమాయత్తం చేయనున్నారు.
ఈ మూడేళ్ళ వైసీపీ పాలనలో ఎన్నడూ లేనివిదంగా టిడిపి రాజకీయ వేధింపులకి గురైంది. టిడిపిని రాజకీయంగా దెబ్బ తీసేందుకు పార్టీ ముఖ్య నేతల ఆర్ధిక మూలాలను వైసీపీ ప్రభుత్వం దెబ్బ తీసింది. కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధించింది. దీంతో టిడిపిలో కొంతకాలం స్తబ్దత నెలకొంది. అప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ స్వయంగా రంగంలో పార్టీ ముఖ్యనేతలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా దిగి ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాలతో వైసీపీ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేశారు. దీంతో టిడిపి శ్రేణుల్లో నూతనోత్సాహం మొదలవగా అది చూసి వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది.
టిడిపిని కోలుకోలేని విదంగా దెబ్బ తీసినా మళ్ళీ ఇంత తక్కువ సమయంలో పుంజుకోవడమే కాక తమపై ఎదురుదాడి కూడా చేస్తుండటాన్ని చూసి వైసీపీ నేతలే నివ్వెరపోతున్నారు. అయితే దీనికి తమ అధినేత, ప్రభుత్వం స్వయంకృతాపరాధాలే కారణమని బహుశః వారికి కూడా తెలుసు.
ఈ మూడేళ్ళలో సిఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏవిదంగా, ఎంతగా నష్టపోయిందో ఈ మహానాడులో చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు వివరిస్తారు. వైసీపీ ప్రభుత్వ అసమర్ధత, తప్పుడు నిర్ణయాలను అవకాశాలుగా మలుచుకొని ముందస్తు ఎన్నికలలో టిడిపిని ఏవిదంగా గెలిపించుకోవచ్చో చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారు. కనుక టిడిపికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఈ మహానాడు చాలా కీలకమైనదని చెప్పవచ్చు.



