మంత్రులకు బెదిరింపు లేఖలు… ఇది ఎవరి పని?

Maoist Threat Letters Sent to AP Ministers

ఏపీ శాసనసభ సమావేశాలు మొదలైన ఈ సమయంలో మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్య కుమార్‌లకు మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖలు వచ్చాయి. ఈ విషయం మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా మీడియాకు తెలియజేశారు. తమకు పోస్టు ద్వారా ఈ లేఖలు వచ్చినట్లు చెప్పారు. దీనిపై తాను తుళ్ళూరు పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశానని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు.

ఆ లేఖలను పరిశీలించిన పోలీస్ నిపుణులు మావోయిస్టుల లేఖలు ఈవిధంగా ఉండవని తేల్చి చెప్పారు. ఒకవేళ నిజంగానే మావోయిస్టులు ఈ లేఖలు వ్రాసి ఉంటే ఈపాటికే అధికారిక ప్రకటన చేసి ఉండేవారు.

ADVERTISEMENT

కానీ ఓ పక్క కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఏరిపారేస్తుంటే, అగ్రనేతలందరూ పోలీసులకు లొంగిపోతుంటే, మిగిలినవారు ఇలాంటి సాహసం చేస్తారా? చేసి ప్రభుత్వాన్ని కవ్వించి సమస్యలు కొని తెచ్చుకుంటారా? అని ఆలోచిస్తే కాదనే అర్ధమవుతుంది.

మరైతే ప్రభుత్వంలో నలుగురు కీలక మంత్రులకు బెదిరిస్తూ లేఖలు వ్రాసే ధైర్యం ఎవరికుంది? ఈ బెదిరింపు లేఖల ద్వారా వారు ఏం సాధించాలనుకున్నారు? అసలు ఈ బెదిరింపు లేఖలు ఎవరు వ్రాశారు? దానిలో ఏమని బెదిరించారు?

బెదిరింపు లేఖలు అందుకున్నవారిలో కందుల దుర్గేష్, జనసేనకు చెందినవారు కాగా, సత్యకుమార్ యాదవ్-బిజేపి, అనగాని సత్య ప్రసాద్, కొల్లు రవీంద్ర ఇద్దరూ టీడీపికి చెందినవారు. కనుక వారి రాజకీయ విరోధులు ఎవరైనా మావోయిస్టుల పేరుతో ఈ లేఖలు వ్రాశారా? అసలు వారిని ఎందుకు బెదిరించారు?

అమరావతికి అప్పులు ఇవ్వొద్దు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దంటూ అంతర్జాతీయ సంస్థలకు ఈమెయిల్స్ పంపినవారే ఈ లేఖలు వ్రాశారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒకవేళ మావోయిస్టులు వ్రాయకపోయి ఉంటే తమ పేరిట ఈవిధంగా మంత్రులకు బెదిరింపు లేఖలు పంపడంపై వారు కూడా స్పందించడం అవసరమే.

ఒకవేళ వారు కాకపోయుంటే సోషల్ మీడియాలో బూతులు, దుష్ప్రచారం తర్వాత రాష్ట్ర రాజకీయాలలో ఇది మరో కొత్త ట్రెండ్ అనే భావించాల్సి ఉంటుంది. మరి ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో?

 

ADVERTISEMENT
Latest Stories