medium range heroes ఎప్పుడూ లేనిది టాలీవుడ్ సమ్మర్ ఈసారి కొంచెం చప్పగా అనిపిస్తున్న మాట నిజం. విరూపాక్ష, దసరా, బలగం లాంటి సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్లు ఉన్నప్పటికీ యునానిమస్ గా ఓవర్ సీస్ నుంచి తెలుగు రాష్ట్రాల దాకా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించినవి వేళ్ళ మీద లెక్కబెట్టేలా ఉన్నాయి. ఈ జోష్ సరిపోదు. ఇంకా కిక్ రావాలి. సెలవుల సీజన్ లో థియేటర్లు నిండుగా ఉంటేనే స్కూళ్ళు కాలేజీలు తెరిచాక వచ్చే స్లంప్ ని ఎగ్జిబిటర్లు తట్టుకుంటారు. అలా కాకుండా నెలకు ఒకటి రెండు మాత్రమే బాగా ఆడితే అందరికీ లాభముండదు.

మే నెల వస్తోంది. హిట్టు కోసం ఆరాటపడుతున్న మీడియం రేంజ్ హీరోలందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గోపీచంద్ ‘రామబాణం’ 5న వస్తోంది. ట్రైలర్ చూస్తే దర్శకుడు శ్రీవాస్ కొత్తగా ఏమీ ప్రయత్నించలేదన్న కామెంట్ వినిపిస్తోంది కానీ ఆయన ధీమా మాత్రం ఖచ్చితంగా సక్సెస్ కొడతామనేలా ఉంది. సరే అదెలాగూ మొదటి ఆటకే తేలిపోతుంది కాబట్టి చూడాలి. నాంది తర్వాత సీరియస్ జానర్ వైపే సీరియస్ గా చూస్తున్న అల్లరి నరేష్ ‘ఉగ్రం’తో అదే రోజు వస్తున్నాడు. విజయ్ కనక మేడల కాంబోలో రెండో ప్రాజెక్ట్.

Also Read – నాల్రోజులు ఈ డ్రామాలు ఆపండర్రా వైసీపిలు…

సీరియస్ పోలీసాఫీసర్ రివెంజ్ డ్రామాని స్పషంగా ముందే చెప్పేశారు కాబట్టి అసలు కంటెంట్ బలంగా ఉంటేనే అల్లరోడికి మరో హిట్టు పడుతుంది. 12న నాగచైతన్యకి ‘కస్టడీ’ రూపంలో పెద్ద పరీక్ష ఎదురుకానుంది. అసలే తమిళ డైరెక్టర్. ఈ మధ్య మన హీరోలకు బొత్తిగా కలిసి రావడం లేదు. పైగా వరస ఫ్లాఫుల్లో ఉన్న కృతి శెట్టి హీరోయిన్. బంగార్రాజు తర్వాత రెండు ఫ్లాపులు చూసిన చైతుకి దీని విజయం చాలా కీలకం. వన్ మూవీ సెన్సేషన్ గా నిలిచిన విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు’నే నమ్ముకుని 2 తగిలించి కొత్త కథతో వస్తున్నాడు.

ఆపై వారం దాటగానే శ్రీవిష్ణు సామజవరగమన, సంతోష్ శోభన్ అన్నీ మంచి శకునములేతో 18న పలకరిస్తారు. ఇద్దరి ట్రాక్ రికార్డు ఎంత డ్యామేజ్ లో ఉందో తెలిసిందే. గత కొంత కాలంగా మాములు డిజాస్టర్లు తగ్గలేదు. ఏ హీరోని చూసుకున్నా మే నెల మొత్తం గెలుపు కోసం పోరాటం బ్యాచ్ లా ఉంది. ఎవరికీ భీకరమైన ఓపెనింగ్స్ తెచ్చే రేంజ్ లో లేదు. పూర్తిగా టాక్ ని నమ్ముకుని దిగాల్సిందే. యావరేజ్ అనిపించుకున్నా లాభం లేదు. చాలా బాగుందనే మాట వస్తే తప్ప గట్టెక్కవు. మరి విజయలక్ష్మి ఎందరిని వరిస్తుందో చూడాలి.

Also Read – సెకండ్ హాఫ్ లో టాలీవుడ్ దే హవా!