ఇదివరకు విజయనగరం జిల్లాలో పార్వతీపురం ఉన్నప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి సన్నిహితుడుగా మెలిగిన జోగారావు టికెట్ సంపాదించుకొని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచారు. ఆ ఎన్నికలలో ఆయన గెలిచేందుకు అరకు పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ అధ్యక్షుడు పరీక్షిత్తు రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఎంతగానో సహకరించారు. అయితే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ అండదండలునందున తనకు సాయం చేసిన వారిరువురితో సహా పార్వతీపురంలో వైసీపీ నేతలందరితో దురుసుగా వ్యవహరించడం మొదలుపెట్టారు.
ఇప్పుడు పార్వతీపురం మన్యం కొత్త జిల్లాగా మారడంతో జిల్లా రాజకీయాలను తానే శాశించే ప్రయత్నం చేస్తుండటంతో పాముల పుష్ప శ్రీవాణి, పరీక్షిత్తు రాజుతో సహా అందరూ ఆయనకి దూరంగా ఉంటూ వేరే వర్గంగా ఏర్పడ్డారు. దీంతో ఇరువర్గాల మద్య ఆధిపత్యపోరు మొదలైంది. ఒకానొక సమయంలో పుష్ప శ్రీవాణి జోగారావుపై సిఎం జగన్మోహన్ రెడ్డికి నేరుగా ఫిర్యాదు చేయడంతో, ఆమె సిఫార్సు మేరకు పార్వతీపురం జిల్లా ఇన్‌ఛార్జ్‌గా పరీక్షిత్తు రాజుని నియమిస్తుండటంతో ఇప్పుడు వారిరువురిదీ పైచేయిగా మారింది. కనుక ఇదే అదునుగా ఈ మూడున్నరేళ్ళలో జోగారావు అవినీతి, అక్రమాల భాగోతాల జాబితాని సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. దానిని ఐప్యాక్ సిబ్బంది చేతికి అందించి వచ్చే ఎన్నికలలో జోగారావుకి మళ్ళీ పార్టీ టికెట్ ఇవ్వకుండా అడ్డుకోవాలని వారు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఈ విషయం గ్రహించిన ఎమ్మెల్యే జోగారావు మంత్రి బొత్స సత్యనారాయణ ద్వారా వారిరువురినీ అదుపు చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే విజయనగరం జిల్లా నుంచి పార్వతీపురం విడిపోయినందున పుష్ప శ్రీవాణి, పరీక్షిత్తు రాజు ఇద్దరూ కూడా ఈసారి తగ్గేదేలే… అంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వారు తగ్గకపోతే, ఇంతకాలం జోగారావుకి వారికీ మద్య సాగుతున్న ఈ యుద్ధం అప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణకి వారి మద్యకి మారుతుంది.
ఇప్పటికే విజయనగరం జిల్లాలో వైసీపీలో ఓవర్గం బొత్స సత్యనారాయణ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుడు రెండు జిల్లాలలో వైసీపీలో కుమ్ములాటలు మొదలవుతాయి. కనుక పరిస్థితి అంతవరకు వెళ్లకుండా నివారించేందుకు మంత్రి బొత్స సత్యనారాయణ పుష్ప శ్రీవాణి, పరీక్షిత్తు దిల్‌రాజు ఇద్దరినీ బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.



