రాజకీయాలలో స్థిత ప్రజ్ఞత చాలా అవసరం. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రోజుకో మాట మాట్లాడుతూ నవ్వుల పాలవుతుంటే, ప్రధాని మోడీ మాత్రం చాలా స్థిత ప్రజ్ఞత చూపుతూ భారతీయులతో పాటు ప్రపంచ దేశాల ప్రశంశలు అందుకుంటున్నారు.
భారత్ పట్ల ట్రంప్ ఎంత దురుసుగా వ్యవహరిస్తున్నప్పటికీ ప్రధాని మోడీ మాత్రం సంయమనం కోల్పోలేదు. కానీ ఆయన సానుకూలంగా స్పందించిన ప్రతీసారి ప్రధాని మోడీ కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. అలాగని ఏ విషయంలోను మోడీ వెనక్కు తగ్గలేదు!
సుంకాలు, హెచ్-1బీ వీసాలతో భారత్‌ని చాలా సులువుగా లొంగదీసుకోవచ్చని ట్రంప్ అనుకున్నారు. ఒకవేళ ప్రధానిగా మోడీకి బదులు వేరే వ్యక్తి ఉన్నా లేదా కేంద్రంలో వేరే కూటమి అధికారంలో ఉన్నా బహుశః ఈపాటికి ట్రంప్‌కి దాసోహం అని ఉండేవారేమో? కానీ ప్రధాని మోడీ కొరకరాని కొయ్య అని ట్రంప్‌కి కూడా ఇప్పుడు బాగా అర్ధమయ్యే ఉంటుంది.
కనుక పాకిస్తాన్‌ని చంక నెక్కించుకొంటూ మరో కొత్త డ్రామా మొదలుపెట్టారు. దీనికీ ప్రధాని మోడీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
పాక్ మళ్ళీ దుస్సాహసం చేస్తే ఈసారి ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టేస్తామని భారత్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ద్వారా స్ట్రాంగ్ వార్నింగ్ ఇప్పించారు. ఆయన పాకిస్తాన్‌కి వార్నింగ్ ఇచ్చినట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ ఆ వార్నింగ్ ట్రంప్‌కేనని భావించవచ్చు. భారత్-పాక్ యుద్ధం నేనే ఆపానని గొప్పలు చెప్పుకుంటున్న ట్రంప్‌కి ఇది చెంప దెబ్బ వంటిదే కదా?
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టినప్పుడు, వారం రోజులలోనే ముగించేసి లొంగదీసుకోగలమని పుతీన్ అనుకునారు. కానీ మూడేళ్ళుగా యుద్ధం చేస్తున్న లొంగదీసుకోలేకపోగా, రష్యా ఆర్ధిక సమస్యల ఊబిలో కూరుకుపోయింది. చివరికి తక్కువ ధరకు చమురు అమ్ముకోవలసి వస్తోంది.
డోనాల్డ్ ట్రంప్ కూడా సరిగ్గా ఇదేవిధంగా వ్యవహరిస్తూ భారత్‌ని లొంగదీసుకోవాలనుకున్నారు. అమెరికాకు ఎంతో మేలు చేస్తున్నానంటూ తన దుందుడుకు నిర్ణయాలతో తన దేశానికే నష్టం కలిగించుకుంట్టున్నారు.
కనుక అమెరికన్ పౌరులు, అమెరికన్ కంపెనీలు, వ్యాపార సంస్థల నుంచి క్రమంగా ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు ట్రంప్ తన నిర్ణయాలను ఒకటొకటిగా ఉపసంహరించుకున్నా లేదా తగ్గించుకున్నా ఆశ్చర్యపోనక్కరలేదు.
యావత్ ప్రపంచాన్ని శాశించగల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంత అనాలోచితంగా వ్యవహరిస్తుంటే, ట్రంప్ సృష్టిస్తున్న ఈ ఒత్తిళ్ళన్నిటినీ ప్రధాని మోడీ తట్టుకుంటూ భారత్‌ని ముందుకే నడిపిస్తున్నారు. ప్రపంచదేశాల దృష్టిలో తన ప్రతిష్ట, దేశ ప్రతిష్ట ఇనుమడించేలా చేస్తున్నారు కూడా. ప్రధాని మోడీకి, డోనాల్డ్ ట్రంప్‌కి మద్య ఈ తేడాలే రాజకీయ స్థిత ప్రజ్ఞతకి నిదర్శనంగా భావించవచ్చు.




