నారా లోకేష్‌ సంచలన నిర్ణయం.. ఇక తప్పుకుంటా!

Nara-Lokeshతెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మహానాడులో సంచలన నిర్ణయం ప్రకటించారు. మహానాడులో పార్టీ శ్రేణులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “పార్టీలో సంస్థాగత మార్పులు చేపట్టాలని కోరుకొంటున్నాను. అది నాతోనే ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను.

ఒక వ్యక్తి సుదీర్గకాలం పార్టీ పదవులలో కొనసాగితే నవతరానికి అవకాశాలు ఎలా కల్పించగలం?అందుకే నేను 2+1 విధానాన్ని ప్రతిపాదిస్తున్నాను. అంటే పార్టీలో ఓ వ్యక్తి రెండుసార్లు ఒకే పదవిలో పనిచేస్తే మూడోసారి విరామం తీసుకొని వేరేవారికి అవకాశం కల్పించాలని ప్రతిపాదిస్తున్నాను.

ADVERTISEMENT

ఈ లెక్కన నేను రెండుసార్లు పార్టీ జాతీయ కార్యదర్శిగా చేశాను కనుక ఈసారి నేను తప్పుకొని వేరొకరికి అవకాశం కల్పించాలనుకొంటున్నాను. తద్వారా కొత్త రక్తం..కొత్త ఆలోచనలతో పార్టీ మరింత చురుకుగా పనిచేయగలుగుతుంది,” అని అన్నారు.

ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతూ, ముందస్తు ఊహాగానాలు వినిపిస్తున్న నేపధ్యంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే అభ్యర్ధులను ప్రకటించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెడదామని చెప్పారు. వీలైతే ఆలోపుగానే అభ్యర్ధుల పేర్లను ప్రకటించే ఆలోచన కూడా ఉందని నారా లోకేష్‌ చెప్పారు.

కానీ ఏదో సాకుతో పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకుండా తప్పించుకొని తిరుగుతూ, ఎన్నికల సమయానికి వచ్చి టికెట్ కావాలని అడిగితే నిర్మొహమాటంగా తిరస్కరిస్తామని చెప్పారు. కనుక పార్టీని బలోపేతం చేయడంలో ప్రతీ ఒక్కరూ గట్టిగా కృషి చేయాలని నారా లోకేష్‌ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

నారా లోకేష్‌ చేసిన ఈ 2+1 చాలా మంచి ప్రతిపాదన అని చెప్పవచ్చు. సాధారణంగా కాంగ్రెస్‌ వంటి జాతీయస్థాయి పార్టీలో సైతం పార్టీలో కీలక పదవులు అధిష్టానం చేతుల్లోనే ఉండాలని కోరుకొంటుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇక ప్రాంతీయ పార్టీలలో అయితే అసలు ఇటువంటి ఆలోచన కలలో కూడా చేయరు.

కానీ నారా లోకేష్‌ వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం అని భావిస్తున్నందునే ఇటువంటి త్యాగానికి సిద్దపడ్డారని చెప్పవచ్చు. ఇటువంటి విశాలమైన దృక్పదం ఉన్నప్పుడే ఆ పార్టీలు ఎటువంటి ఆటుపోటులనైనా తట్టుకొంటూ నిబ్బరంగా ముందుకు సాగగలుగుతాయి. కనుక నారా లోకేష్‌ ప్రతిపాదనకు మహానాడు ఏకగ్రీవంగా ఆమోదం తెలపవచ్చు.

ADVERTISEMENT
Latest Stories