నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు వైసీపీ గెలుచుకొన్నందున ఆ జిల్లా పార్టీకి కంచుకోటలా నిలవాలి. కానీ జిల్లాకే చెందిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను పార్టీలో నుంచి బయటకి గెంటేసుకొని ఆ కంచుకోటకు స్వయంగా కన్నం పెట్టుకొంది.
సరే! వాళ్ళు ముగ్గురూ నమ్మక ద్రోహులు కనుక బయటకి గెంటేసిన తర్వాత అయినా జిల్లాలో మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలందరూ ఫెవీకాల్ పూసుకొన్నట్లు కలిసిమెలిసి పనిచేయాలి కదా?కానీ కధ మళ్ళీ మొదటికొచ్చింది.
ఈసారి నెల్లూరు అర్బన్ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విలన్‌గా మారారు. జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నిర్వహించే పార్టీ సమావేశాలకు, అధికారిక కార్యక్రమాలకు కూడా అనిల్ హాజరుకాకుండా సొంతంగా సమావేశాలు నిర్వహించుకొంటుండంటంతో వారు తలపట్టుకొంటున్నారు.
ఇది సరిపోదన్నట్లు, అనిల్ కుమార్ యాదవ్, ఆయన చిన్నాన్న రూప్‌కుమార్ యాదవ్ మద్య పొసగడం లేదు. దీంతో రూప్‌కుమార్ యాదవ్ నెల్లూరులోనే వేరేగా పార్టీ కార్యాలయం ఏర్పాటుచేసుకోవడంతో అర్బన్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులకు ఎటువైపు ఉండాలో తెలియక తలలు పట్టుకొంటున్నారు.
అనిల్ అనుచరుల భూకబ్జాలతో రూరల్ నియోజకవర్గంలో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అనిల్ అనుచరుడు ఒకాయన రూరల్ నియోజకవర్గంలో అల్లిపురంలో ప్రభుత్వ భూమిని కలిపేసుకొని ఓ లేఅవుట్ వేశారు. ఆ పంచాయతీలో అనిల్ కుమార్ యాదవ్ కలుగజేసుకొన్నారు. అలాగే అంబాపురం వద్ద దళితుల కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిని అనిల్ మద్దతుతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కబ్జా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ముగ్గురూ ఇటీవల సమావేశమయ్యి అనిల్ కుమార్ యాదవ్ గురించి చర్చించి, సిఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళాలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. అయితే నెల్లూరు వైసీపీలో మరో వికెట్ పడనుందా?ఒకవేళ పడితే తర్వాత ఎవరి వంతు?



