ఒంగోలులో ఫైవ్ స్టార్ హోటల్‌.. మన ప్రకాశానికి మహర్దశ

Nara Lokesh at the groundbreaking ceremony for Ongole’s first five-star hotel

ప్రకాశం జిల్లాలోని చదలవాడ గ్రామంలో ‘ఫైవ్ స్టార్ హోటల్’ ఏర్పాటవుతుందని ఎప్పుడైనా, ఎవరైనా అనుకున్నారా? కానీ ఇప్పుడు ఏర్పాటవుతోంది. జిల్లాలోని నాగులుప్పలపాడు మండలంలోని ఈ గ్రామంలో రూ. 100 కోట్లు పెట్టుబడితో రాడిసన్ ‘ఫైవ్ స్టార్ హోటల్’ ఏర్పాటు కాబోతోంది.

రవిశంకర్ గ్రూప్, రవిప్రియ హాస్పిటాలిటీస్‌ కలిసి దీనిని నిర్మించబోతున్నాయి. రవిశంకర్ గ్రూప్ అధినేత రవిశంకర్‌తో కలిసి మంత్రి నారా లోకేష్‌ నేడు చదలవాడలో భూమిపూజ చేశారు. ఒంగోలు జిల్లాలో నిర్మింపబడుతున్న మొట్ట మొదటి ‘ఫైవ్ స్టార్ హోటల్’ ఇదే.

ADVERTISEMENT

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న రెండు కీలక నిర్ణయాల వల్లనే నేడు ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్ ఏర్పాటుకి దోహదపడిందని చెప్పవచ్చు.

1. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించడం.

2. అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడం.

మొదటి నిర్ణయం వలన రాష్ట్రంలో పర్యాటక ఆకర్షణలు కలిగిన పలు జిల్లాలలో ఇలాంటి పెద్దా చిన్నా హోటల్స్‌ అనేకం ఏర్పాటవుతున్నాయి.

ప్రకాశం జిల్లాలో పర్యాటక ఆకర్షణలకు కరువు లేదు. కొత్తపట్నం బీచ్, పాకాల బీచ్, మోటుపల్లి బీచ్‌లతో పాటు నల్లమల అడవుల మధ్య భైరవకోన జలపాతం, ఆసియాలోనే అత్యంత పురాతనమైన కంబం చెరువు, గుండ్లకమ్మ నదిపై నిర్మించిన మల్లావరం డ్యామ్ వంటి చక్కటి పర్యాటక ఆకర్షణలున్నాయి.

7వ శతాబ్దానికి చెందిన భైరవకోన గుహాలయాలు, ఒంగోలు నగరంలో విజయనగర కాలం నాటి పురాతన, ప్రసిద్ధ వైష్ణవాలయం శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవాలయం, మాలకొండ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉన్నాయి.

శాతవాహనుల కాలం నాటి చారిత్రక చందవరం బౌద్ధ స్థూపం, బౌద్ధ శిథిలాలు, కనిగిరి కొండపై మధ్యయుగాల నాటి కోట, దాని చుట్టుపక్కల లోయలున్నాయి.

ప్రకాశం జిల్లాలో ఇన్ని పర్యాటక ఆకర్షణలు ఉన్నప్పటికీ ఇంతకాలం పెద్దగా గుర్తింపుకు నోచుకోలేదు. కానీ ఇకపై వీటనిటికీ మహర్దశ మొదలవుతుంది. అందుకు చదలవాడలో నేడు బీజం పడింది.

అమరావతి నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నందున ఇప్పటికే ఆ ప్రాంతంలో పలు ఉన్నత విద్యా సంస్థలు, ప్రముఖ వైద్య సంస్థలు, ఫైవ్ స్టార్ హోటల్స్, పలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థల కార్యాలయాలు నిర్మితమవుతున్నాయి.

కనుక అమరావతి పరిసర ప్రాంతాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అమరావతికి 146 కిమీ దూరంలో ఉన్న ఒంగోలులో కూడా అభివృద్ధి జరుగుతోందని గ్రహించేందుకు ఇదే చక్కటి నిదర్శనం.

ADVERTISEMENT
Latest Stories