రెండు రాష్ట్ర రాజకీయాలలో విపక్షంలో ఉన్న వైసీపీ, బిఆర్ఎస్ పార్టీ ల అధినేతలు ఫామ్ హౌస్ రాజకీయాలు, ప్యాలస్ రాజకీయాలు చేస్తూ ప్రజా రాజకీయానికి దూరంగా ఉంటున్నారు.
అయితే ఇక్కడ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పోలిస్తే వైసీపీ అధినేత జగన్ కాస్త పర్లేదు అనిపించినా కేసీఆర్ మౌనం బిఆర్ఎస్ కు ఎంత ప్రమాదంగా మారిందో జగన్ పలుకులు కూడా వైసీపీ కి అంతే హానికరంగా తయారవుతున్నాయి.
అధినేతలు అనే వారు రాజకీయాలలో గెలుపోటములను సమాన దృష్టితో చూస్తూ పార్టీని ముందుకు నడిపించాలి, అలాగే నాయకులను వెనుకనుండి భుజం తట్టి లేపాలి. కానీ ఇక్కడ గెలుపులో అధికారాన్ని అనుభవించిన పార్టీల అధినేతలు ఓటమిని మాత్రం అంగీకరించలేకపోతున్నారు.
పార్టీని స్థిరంగా, దృఢంగా ప్రజల మధ్యకు తీసుకెళ్లాల్సిన అధినేతలే ప్రజలకు ముఖం చాటేస్తూ, అధికార పార్టీ నాయకులకు ముఖం చూపించకుండా నాయకుడి లేని దోబూచు రాజకీయాలు నడుపుతున్నారు. ఇలా నాయకుడు లేని రాజకీయం ఆయుధాలు లేని యుద్ధాల మాదిరి ఎటువంటి ఫలితాన్ని అందించలేవు అనేది గ్రహించాలి.
వైసీపీ విషయానికొస్తే జగన్ బెంగళూర్ నుంచి తాడేపల్లికి వీకెండ్ పాలిటిక్స్ చేస్తూ పార్టీ క్యాడర్ ని రప్ప రప్ప రాజకీయాల వైపు ప్రోత్సహిస్తున్నారు, ఇక బిఆర్ఎస్ సంగతి చూస్తే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యి తాత్కాలిక అస్త్రసన్యాసం చేస్తూ అజ్ఞాతంలో ఉంటున్నారు.
గతంలో సజ్జల సలహాలతో, పెద్ది రెడ్డి చర్యలతోను, సాయి రెడ్డి ట్వీట్లతోను, కొడాలి బూతులతో, గుడివాడ జోకులతో, వల్లభనేని వ్యాఖ్యలతో, జోగి దాడులతో, ద్వారం పూడి గుండాయిజం తో, అనిల్ అర పర్సెంట్ ప్రకటనలతో, రోజా నోటీ దూలతో నిత్యం మీడియా ముందు కళకళ లాడే వైసీపీ నేడు పేర్ని నాని విమర్శలతో, అంబటి వెటకారంతో సరిపెట్టుకుంటుంది.
గతంలో ప్రత్యర్థి పార్టీల మీద కత్తులలాంటి మాటలతో విరుచుకుపడే కేసీఆర్, ప్రత్యర్థి నోటికి తాళం వేసే తలసాని, సబితా ఇంద్రా రెడ్డి, ప్రాంతీయ రాజకీయానికి ప్రధమ ప్రాధాన్యం ఇచ్చే గంగుల ప్రభాకర్ ఇలా అనేకమంది బిఆర్ఎస్ నేతలు ఇప్పుడు మీడియా కే కాదు కనీసం పార్టీ క్యాడర్ కి కూడా అందుబాటులో లేరనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.
అలాగే అసెంబ్లీ విషయానికొస్తే ఏపీలో వైసీపీ జగన్ తో సహా పూర్తిగా ఛట్ఠసభలకు డుమ్మాకొడితే, తెలంగాణలో మాత్రం కేసీఆర్ మినహా ఇతర బిఆర్ఎస్ నాయకులు అసెంబ్లీకి వచ్చి పోతున్నారు. అయితే ఇలా అధినేతలు లేకుండా ఆయా పార్టీల నాయకులు చేస్తున్న రాజకీయం ఆయుధాలు లేని యుద్ధాల మాదిరి చప్పగా సాగుతున్నాయనే చెప్పాలి.






