వైసీపి ప్రభుత్వంలో బడుగు బలహీనవర్గాలకు మంత్రి పదవులు ఇచ్చి సామాజిక న్యాయం పాటిస్తున్నామని చెప్పుకొనేందుకు, జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు వారి చేత బస్సు యాత్రలు చేయిస్తుంటారు. చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసి టిడిపిని బలహీనపరిచి వైసీపికి అడ్డులేకుండా చేసుకోవాలనుకొంటే, రాష్ట్ర ప్రజలలో ఆయన పట్ల సానుభూతి పెరిగిందని, దాంతో ఎన్నికలలో టిడిపి లబ్ధి పొందబోతోందని జగన్ త్వరగానే గుర్తించారు.
కనుక నష్ట నివారణ కోసం మళ్ళీ వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలని ‘సామాజిక సాధికార యాత్ర’ పేరుతో బస్సులు ఎక్కించి ప్రజల వద్దకు పంపించారు. వైసీపి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా ధర్మవరంలో బస్సు యాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన వైసీపిలో సామాజిక న్యాయం అమలవుతోందని కానీ టిడిపి పూర్తిగా కమ్మ నాయకులే పెత్తనం చేస్తారని విమర్శించారు. టిడిపి గెలిచి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రెడ్లకు గడ్డుకాలం మొదలవుతుందని అన్నారు.
కేతిరెడ్డి వ్యాఖ్యలకు టిడిపి నియోజకవర్గం ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్ చాలా ధీటుగా సమాధానం చెప్పారు. ధర్మావరం టిడిపి కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ, “రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కేతిరెడ్డి సామాజిక సాధికార యాత్ర చేయడమే హాస్యస్పదంగా ఉంది. ఆయన ‘జగన్ భజన యాత్ర’ చేస్తూ టిడిపి గురించి మాట్లాడటం దేనికి?
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మంత్రి పదవులు ఇచ్చారని చెప్పుకొన్నారు. కానీ వారికి మీ అధినేత కార్యాలయాలు, కనీసం కూర్చోనేందుకు కుర్చీలైనా ఇచ్చారా?మీ మంత్రి పదవులు దర్జా వెలగబెట్టేందుకు, జనాలకి చెప్పుకొనేందుకే తప్ప ఎవరికీ ప్రభుత్వంలో ప్రాధాన్యత లేదని అందరికీ తెలుసు.
టిడిపి వస్తే రెడ్లకు అన్యాయం జరుగుతుందంటున్నారు. సరే!ధర్మవరంలో రెడ్లకు మీరేమి మేలు చేశారో చెప్పగలరా కేతిరెడ్డి?మీ పార్టీపై కులం ముద్ర ఉందేమో కానీ టిడిపి అన్ని కులాలను కలుపుకుపోయే పార్టీ అని అందరికీ తెలుసు. టిడిపిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు ఉన్నారని మీకు తెలుసు. మరి టిడిపి రెడ్లకు అన్యాయం చేస్తుందని ఎలా చెపుతున్నారు?” అని పరిటాల శ్రీరామ్ ప్రశ్నించారు.
“రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. కాకినాడలో దళిత యువకుడిని హత్య చేసింది ఎవరు మీవాడు కాదా? దళితుడిపై మూత్రం పోసి అవమానించింది మీవాళ్ళే కదా?మీ వైసీపి నాయకులు పట్టణంలో ఎస్సీ, ఎస్టీల భూములు ఆక్రమించడం, వారి బోరుబావులు పూడ్చి వేయించడం నిజం కాదా?
ధర్మవరంలో మాంగల్య షో రూమ్ కోసం దసరా పండుగ సమయంలో పట్టణంలోని చేనేత దుకాణాలు మూయించిన మాట వాస్తవం కాదా?అప్పుడు వారందరూ మీవద్దకు వస్తే ఏవిదంగా అవమానించి పంపించారో అందరికీ తెలుసు. ఇదేనా మీ సామాజిక న్యాయం?” అంటూ పరిటాల శ్రీరామ్ ప్రశ్నించారు.





