ఎన్నికల ప్రచార సభలలో డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రసంగాలు ఉత్తేజభరితంగా సాగుతాయి. అదే… పార్టీ అంతర్గత సమావేశాలలో చాలా ఆలోచింపజేస్తాయి.
ఈరోజు పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమైనప్పుడు మాట్లాడుతూ, “పదవీ అధికారం కోరుకునేవారు క్షేత్రస్థాయిలో పనిచేయాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. అప్పుడే ప్రజాధరణ పొందుతారు. అప్పుడు పదవీ, అధికారం వాటంతట అవే వస్తాయి.
నేను రాజకీయాలలో ప్రవేశించినప్పటి నుంచి ఇదేవిధంగా పనిచేశాను. ఏనాడూ పదవీ అధికారం ఆశించలేదు. చివరికి వాటంతట అవే లభించాయి కదా?
కానీ ప్యాలస్‌లో కూర్చొని అధికారం కావాలనుకోవడం అత్యాశే. పదవీ అధికారం అంటే ప్రజలు, ప్రత్యర్ధులపై ఆధిపత్యం చలాయించడానికో లేదా అవినీతి, అక్రమాలకూ పాల్పడేందుకో అనుకునేవారు ఎక్కువ. కానీ పదవీ, అధికారం అంటే ఓ బాధ్యత, ప్రజల పట్ల జవాబుదారీగా ఉండాలి.
ఒక వ్యక్తి లేదా ఓ ముఠా సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసి అధికారం కైవసం చేసుకోవాలనుకోవడం చాలా దుర్మార్గపు ఆలోచన. అటువంటి వారిని ఎదుర్కొని వారి ప్రయత్నాలను అడ్డుకునేందుకు నేను రాజకీయాల్లోకి వచ్చాను.
ఇదివరకు చంద్రబాబు నాయుడు తన కుప్పం నియోజకవర్గంలో పర్యటించకుండా వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయనని అడ్డుకోవడాన్ని రాజకీయాలలో సహజం అని అనుకోవచ్చు. కానీ ఆ స్థాయి నాయకుడుని నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా అడ్డుకున్నవారు, నేడు అధికారంలో ఉండి ఉంటే, రేపు పంచాయితీ ఎన్నికలలోనో లేదా మరో సందర్భంలోనో అందరినీ ఇలాగే బెదిరించి భయపెట్టి అడ్డుకోకుండా ఉంటారా?
కనుక ఓ వ్యక్తి… ఓ ముఠా సమాజాన్ని భయపెట్టి ఆధికారం సాధించాలనే దురాలోచన చేస్తున్నవారిని మనమూ సమర్ధంగా అడ్డుకోవాలి. అప్పుడే రాష్ట్రంలో స్థిరత్వం వస్తుంది. అభివృద్ధి జరుగుతుంది.
అందుకే సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మరో 10-15 ఏళ్ళు కొనసాగాలని చెప్తుంటాను.
మనందరి లక్ష్యం రాష్ట్రాభివృద్ధి కావాలే తప్ప పదవులు, అధికారం కాదు. కనుక కూటమి ప్రభుత్వం సుస్థిరతకు జనసైనికులు ప్రతీ ఒక్కరూ తోడ్పడాలి,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.






