సనాతన ధర్మం కోసం: నరసింహ వారాహి గణం!

Pawan Kalyan Narasimha Varahi Ganam

జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆశీసులతో జనసేన పార్టీలో ‘నరసింహ వారాహి గణం’ని ఏర్పాటు చేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, “నేను అన్ని మాతాలను గౌరవిస్తాను. కానీ నా హిందూ మతం కోసం నేను నిలబడతాను. అవసరమైతే ఎవరితోనైనా పోరాడుతాను. కనుక సనాతన ధర్మాన్ని కాపాడేందుకు జనసేనలో ‘నరసింహ వారాహి గణం’ ఏర్పాటు చేస్తున్నాను,” అని చెప్పారు.

ADVERTISEMENT

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై టిడిపి, వైసీపిల మద్య రచ్చరచ్చ జరుగుతున్నప్పుడే, పవన్‌ కళ్యాణ్‌ పదిరోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి సనాతన ధర్మ పరిరక్షణ కోసం తాను నిలబడతానంటూ వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. బహుశః ఇది జనసేన కార్యకర్తలు, ముఖ్యంగా ఆయన సినీ అభిమానులను అయోమయానికి గురి చేసి ఉండవచ్చు.

బీజేపీకి అనుబందంగా భజరంగ్ దళ్ వంటి కొన్ని హిందూ సంస్థలున్నట్లే, ఇప్పుడు జనసేనలో ‘నరసింహ వారాహి గణం’ ఏర్పాటు చేసుకున్నట్లు భావించవచ్చు. కానీ జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా తిరుమలతో సహా పుణ్యక్షేత్రాలలో, దేవాలయాలలో అపచారాలు, విధ్వంసాలు జరుగుతున్నప్పుడు పవన్‌ కళ్యాణ్‌ ‘నరసింహ వారాహి గణం’ ఏర్పాటు చేసుకొని యుద్ధం చేసి ఉండి ఉంటే అందరూ హర్షించేవారు. పవన్‌ కళ్యాణ్‌ సనాతన ధర్మ పరిరక్షణ గురించి ఎవరికీ ఎటువంటి సందేహాలు, అపోహలు వచ్చేవే కావు. కానీ అప్పుడు మౌనంగా ఉండిపోయి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వలన ఎవరికైనా తప్పకుండా సందేహాలు, అపోహలు కలగడం సహజం.

ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. వాటి గురించి తన అభిప్రాయాలు ట్వీట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

హిందూ మతాన్ని నమ్మని ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలు ఇన్ని దశాబ్ధాలుగా తమిళనాడుని ఏలుతున్నాయి. తమిళనాడులో భాషాభిమానం, ఈ ద్రవిడ ప్రభావం చాలా ఎక్కువగా ఉండటం వలన ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బీజేపీ ఆ రాష్ట్రంలో అడుగుపెట్టలేకపోతోంది.

ఉత్తరాదికి చెందిన కాంగ్రెస్‌, బీజేపీలు తమపై బలవంతంగా హిందీని రుద్దాలని ప్రయత్నిస్తున్నాయనే వాదనతో డీఎంకే, అన్నాడీఎంకేలు దానిని అడ్డుకుంటున్నాయి.

అయితే అవి అధికారం చలాయిస్తున్న తమిళనాడులోనే దేశంలోకెల్లా అత్యధిక పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు ఉన్నాయి. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను చాలా నిష్టగా పాటించే జనాభా కూడా తమిళనాడులో చాలా ఎక్కువే. అయినా కూడా మతం ఆధారంగా రాజకీయాలు చేసే బీజేపీకి తమిళనాడుపై పట్టు దొరకడం లేదు.

అందుకే హిందూ మతాన్ని వ్యతిరేకించే ద్రవిడ పార్టీలకు చెక్ పెట్టేందుకు తమిళనాడులో కూడా సినీ అభిమానులు కలిగిన పవన్‌ కళ్యాణ్‌ని అస్త్రంగా సందించబోతోందని, ద్రవిడ రాజకీయాలను ఛేదించే ఆ దివ్యాస్త్రమే ‘సనాతన ధర్మ పరిరక్షణ’ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అవునో కాదో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories