అలనాడు దేవుడు ప్రత్యక్షమై వరాలు ఇచ్చేవాడు… నేడు ప్రత్యక్షం కాకపోయినా భక్తితో ప్రార్ధిస్తే కోరిన కోర్కెలు తీర్చి కష్టాలు గట్తెక్కిస్తాడు… అని కోట్లాది మంది నమ్ముతారు. కానీ ఎవరూ దేవుడు ప్రత్యక్షమై వరాలు ఇవ్వడం కళ్ళారా చూడలేదు. అటువంటివారి కోసమే ఇది.
ప్రతీసారీ దేవుడు స్వయంగా వచ్చి వరాలు ఇచ్చి కష్టాలు తీర్చక పోవచ్చు. కానీ ఏదో రూపంలో వరాలు ఇస్తాడు.. కష్టాలు తీర్చుతాడు. అందుకు తాజా నిదర్శనం ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు.
అంధుల మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్ జట్టును ఆహ్వానించి ఒక్కో క్రీడాకారిణికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.84 లక్షలు బహుమతిగా అందించారు. ప్రభుత్వం తరపున కాదు… తన స్వార్జితం నుంచి!
ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు, పాడేరులోని జనసేన నేతలు వంట్లమామిడి గిరిజన గ్రామంలో నివసిస్తున్న మరో క్రికెటర్ కరుణ కుమారి కుటుంబాలకు సమస్తం ఏర్పాటు చేయించారు.
పవన్ కళ్యాణ్ సూచన మేరకు సత్యసాయి జిల్లా జనసేన నేతలు బియ్యం, పప్పుప్పులు, వంటనూనె వండుకునేందుకు కుక్కరు, గిన్నెలు, కడాయిలు, కంచాలు, గిన్నెలు, మిక్సీ, గ్రైండర్ వగైరా అందించారు. దుప్పట్లు, దిండ్లు, బకెట్లు, కట్టుకునేందుకు కొత్త బట్టలు ఇచ్చారు.
ఇంటికి అవసరమైన ఎల్ఈడీ లైట్లు, ఫ్యాన్లు, టీవీ ఒకటేమిటి సమస్తం అందించారు. వారిరువురి కుటుంబాలకు క్రీడాకారుల కోటాలో ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత కొత్త ఇంటికి అవసరమైన ఫర్నీచర్, ఇతర సామాగ్రి అందిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
అలాగే సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలోని హేమవతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహెట్టికి 5 కిమీ మేర తారు రోడ్లు వేసేందుకు జిల్లా కలెక్టర్ తక్షణమే రూ.6.2 కోట్ల పనులకు పరిపాలనా పరమైన అనుమతి మంజూరు చేశారు. త్వరలోనే రోడ్ నిర్మాణ పనులు మొదలవుతాయి.
కనీసం తినడానికి తిండి, కట్టుకోవడానికి సరిపడా బట్టలు కూడా లేని ఆ నిరుపేద కుటుంబాలను నిత్యావసర సరుకులు, వస్తువులతో నింపేశారు. దేవుడు వరం ఈయడం అంటే ఇదే కదా?




