మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తన కుమారుడు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కలిశారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడుతూ, “ చంద్రబాబు నాయుడు మా పట్ల చాలా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. మా ప్రభుత్వం ఆయనని అరెస్ట్ చేసినప్పుడు జైలులో ఎటువంటి మర్యాదలు జరిగాయో ఆయనకు తెలుసు.
కానీ ఎంపీ మిథున్ రెడ్డికి అటువంటి మర్యాదలు, సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బంది పెడుతున్నారు. మా ప్రభుత్వ హయంలో ఇక్కడ ఇంత మంది పోలీసులు, ఇన్ని బ్యారికేడ్లు ఉండేవే కావు. కానీ ఇప్పుడు మేము జైలు బయట కూడా మీడియాతో మాట్లాడకుండా చేసేందుకే ఇంతమందిని మొహరించారు.
వీటన్నిటికీ భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు తప్పకుండా ప్రతిఫలం అనుభవించక తప్పదు,” అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శపించారు.
తనని చాలా రోజుల పాటు ఓ చీకటి గదిలో ఒంటరిగా బందించారని చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు. తన వయసును దృష్టిలో ఉంచుకొని జైలులో ప్రత్యేకమైన గదిలో ఉంచాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తిని జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. జైలులో డెంగూ, మలేరియా దోమలున్నాయని చెప్పినా పట్టించుకోలేదు.
నిజానికి చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టి మానసికంగా, శారీరికంగా క్రుంగిపోయేలా చేసి టీడీపిని దెబ్బ తీయాలనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా ఈ కష్టాలను, సవాళ్ళను చాలా ధైర్యంగా ఎదుర్కొని బయటకు వచ్చారు. ఎన్నికలలో పోటీ చేసి జగన్‌ని ఓడించారు.
జైల్లో చంద్రబాబు నాయుడుకి తాము ఏవిదంగా నరకం చూపించామో అప్పుడే మరిచిపోయినట్లున్నారు. , అటువంటి మర్యాదలు, సౌకర్యాలు తమకు కల్పించడం లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ పడుతున్నారు. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకుంటేగా?
కోర్టు ఆదేశం మేరకు జైల్లో అటాచ్ టాయిలెట్‌తో కూడిన ప్రత్యేక గది, రోజూ ఇంటి భోజనం, జాగింగ్ చేసేందుకు వెసులుబాటు, దాని కోసం జాగింగ్ షూస్, ఓ వ్యక్తిగత సహాయకుడు… ఇంకా చాలా ఏర్పాట్లు చేశారు. కానీ తమకీ మర్యాదలు, సౌకర్యాలు సరిపోవడం లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధపడుతున్నారు.






