ఆంధ్రప్రదేశ్‌లో జనసేన బలమెంతో… దానికి ఈసారైనా కాపు సామాజికవర్గం అండగా నిలబడుతుందో లేదో తెలీదు. జనసేన బిజెపి కలిసి ఎన్నికలకి వెళతా లేక టిడిపితో కలిసి వెళుతుందో కూడా తెలీదు. కానీ వైసీపీలో సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరి ధ్యాస, ఆలోచనలు అన్ని దాని చుట్టూనే తిరుగుతుంటాయి. గత ఎన్నికలలో ఒకే ఒక్క సీటు గెలుచుకొన్న ఆ పార్టీని చూసి 175 సీట్లు గెలుచుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తున్న వైసీపీ ఇంతగా ఆందోళన చెందుతుండటం గమనిస్తే రాష్ట్రంలో జనసేన బలపడిందని, వచ్చే ఎన్నికలలో అది తమ విజయావకాశాలను దెబ్బతీయగలదని గట్టిగా నమ్ముతున్నట్లే ఉంది. బహుశః అందుకే వైసీపీ నేతలందరూ పవన్ కళ్యాణ్ భజన చేస్తున్నట్లు భావించవచ్చు.
పవన్ కళ్యాణ్ తన రాష్ట్ర పర్యటనలకి, ఎన్నికల ప్రచారానికి వారాహి పేరుతో ఓ వాహనాన్ని సిద్దం చేసుకొని, దానికి మిలటరీ వాహనాలకు వేసే ఆలీవ్ గ్రీన్ రంగు వేయించడంతో మళ్ళీ వైసీపీ నేతలు నోటికి పని చెపుతున్నారు. అది వాహనం గురించి కనుక రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ముందుగా స్పందిస్తూ, “మిలటరీ వాహనాలకు వాడే ఆలీవ్ గ్రీన్ కలర్‌ని ప్రైవేట్ వాహనాలకు వేయకూడదని మోటారు వాహనాల చట్టం చెపుతోంది. కనుక పవన్ కళ్యాణ్ వాహనం వారాహికి ఆ రంగుతో రిజిస్ట్రేషన్ అవ్వదు.
అయినా ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు కనుక పవన్ కళ్యాణ్ ఓ నాలుగు రోజులు ఆగారు కానీ రేపు ఎలాగూ ఆయన టిడిపితోనే కలవాలనుకొంటున్నారు కనుక తన వాహనానికి పసుపు రంగు వేసుకొంటే బాగుంటుంది కదా?అయినా అలాంటి వాహనాలతో ఎన్నికలలో గెలవడం సాధ్యమైతే మేమందరం కూడా తలో వాహనం ఎప్పుడో కొనేసుకొని ఉండేవాళ్ళం కదా? ఇలాంటి డ్రామాలు సినిమాలలో బాగుంటాయి కానీ రాజకీయాలలో కాదు.
ఆయన రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు తనకు రక్షణ లేదు కనుకనే అటువంటి వాహనం తయారు చేయించుకొన్నానని చెపుతున్నట్లు విన్నాను. ఒకవేళ మా ప్రభుత్వమే ఆయనకి రక్షణ కల్పించకుంటే మా ప్రభుత్వం గురించి, మా పార్టీలోని కాపు నేతల గురించి నోటికి వచ్చిన్నట్లు విమర్శిస్తున్నా ఆయన బయట తిరగగలిగేవారా? మా పార్టీ రాజకీయాలకి అతీతంగా అన్ని పార్టీల నేతలకి రక్షణ కల్పిస్తోంది,” అని అన్నారు.



